పామాయిల్ సాగు చేయాలి -జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక
పామాయిల్ సాగు చేయాలి
-జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక
భద్రాద్రి కొత్తగూడెం,శోధన న్యూస్: సంప్రదాయ పంటల సాగును విడనాడి రైతులు పామాయిల్ సాగు చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల ఉద్యాన, వ్యవసాయ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో పామాయిల్ లక్ష్యం మేర సాగు చేపట్టేందుకు ఉద్యాన, వ్యవసాయ, గోద్రెజ్, ఆయిల్ఫైడ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ మాసం వరకు 8400 మొక్కలు నాటాల్సి ఉండగా 7147 మొక్కలు నాటామని, మిగిలిన 1253 మొక్కలు ఈ నెలాఖరు వరకు నాటే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. రైతులు ఆయిల్ష్పామ్ పంట సాగు చేపట్టే విధంగా క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి సన్నద్దం చేయాలని చెప్పారు. పామాయిల్ పంటసాగులో అంతరపంటల సాగు చేపట్టేందుకు అవకాశం ఉన్నందున పామాయిల్ సాగు చేపట్టే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. లక్ష్యసాధనలో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని, రానున్న నెల రోజుల్లో ప్రగతి పరిశీలన తదుపరి బదిలీ ప్రక్రియ చేపడతామని చెప్పారు. రైతులు ఆసక్తి చూపడం లేదని చెప్పిన సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ లిఖితపూర్వకంగా అందచేయాలని ఆదేశించారు. విధుల పట్ల అంకితభావం ఉండాలని, కారణాలు చెప్పడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్యసాధనలో జీరో ఉన్న క్లస్టర్స్ జాబితా అందచేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రగతి వస్తుందని, ఆసక్తి కనబరచకపోతే ప్రగతి ఎలా వస్తుందని ప్రశ్నించారు. మీరు పట్టించుకోవడం లేదు, మా వాళ్లు పట్టించుకోవడం మానేశారని గోద్రెజ్ కంపెనీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరంతర పర్యవేక్షణ చేయాలని, ప్రగతి రావాలని చెప్పారు. పంట మార్పిడులు వల్ల రైతులకు మేలు జరుగుతుందని, అట్టి సమాచారం ప్రతి రైతుకు చేరాలని చెప్పారు. రానున్న వేసవిలో పంటసాగుపై |క్రాప్ బుకింగ్ చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో వ్యవసాయ అధికారి అభిమన్యుడు, ఉద్యాన అధికారి జినుగు మరియన్న, వ్యవసాయ, ఉద్యాన అధికారులు, ఆయిల్ఫైడ్, గోద్రెజ్ కంపెనీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.