తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

నామినేషన్లు ప్రక్రియకు  పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి–భద్రాద్రి జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంక 

నామినేషన్లు ప్రక్రియకు  పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి 

  • భద్రాద్రి జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంక 

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్: ఈ నెల 3వ తేదీ నుంచి జరుగనున్న నామినేషన్లు ప్రక్రియకు రిటర్నింగ్ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్  డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. బుధవారం ఐడిఓసి కార్యాలయపు మిని సమావేశపు హాలులో నామినేషన్లు ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య నామినేషన్లు స్వీకరించాలని తెలిపారు. ఈ నెల 5వ ఆదివారం సెలవు కావడంతో నామినేషన్లు స్వీకరించబడవన్నారు. ఒకే రోజు ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు వస్తే టోకెన్లు జారీ చేసి క్రమసంఖ్య ప్రకారం నామినేషన్లు స్వీకరించాలని తెలిపారు. ముహూర్తాలు బావున్నాయని ఆ రోజుల్లో అధికసంఖ్యలో అభ్యర్థులు వచ్చే అవకాశం ఉన్నందున తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు. నామినేషన్ ప్రక్రియపై అవగాహన, సలహాలు, సూచనలు ఇచ్చేందుకు రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్ లను  ఏర్పాటు చేయాలని సూచించారు. నామినేషన్ల ప్రక్రియకు ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలన్నారు. నామినేషన్ వేసేందుకు అభ్యర్థితో పాటు మరో నలుగురు వ్యక్తులను, మూడు వాహనాలను మాత్రమే అనుమతించాలన్నారు.  ఆన్లైన్ ద్వారా నామినేషన్ వేసేందుకు అవకాశం ఉందన్నారు. జనరల్, బీసీ అభ్యర్థులకు రూ. 10 వేల డిపాజిట్ ఉంటుందని, రిజర్వుడు అభ్యర్థులకు 5 వేల రూపాయలు డిపాజిట్ ఉంటుందని, రిజర్వుడు అభ్యర్థులు కుల ధృవీకరణ అందచేయాలని తెలిపారు.  నామినేషన్ వివరాలను ప్రతి రోజు నోటీసు బోర్డులో పెట్టాలని తెలిపారు.  రాష్ట్రంలో ఎక్కడ ఓటు ఉన్నా అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం ఉందని, అయితే బలపరిచే వ్యక్తులు ఆ నియోజకవర్గానికి చెందిన వారై ఉండాలని తెలిపారు. ఇతర ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు ఆయా మండలాల తహశీల్దారుల ద్వారా పొందిన ధృవీకరణ అందచేయాలన్నారు. నామినేషన్ లలో  అసంపూర్తిగా ఉన్న అంశాలపై ఆర్వో నోటీసులు జారీ చేయాలని తెలిపారు.. నామినేషన్లు వివరాలను క్రమం తప్పక రిజిష్టరులో నామినేషన్లు దాఖలు తేదీ, సమయం తప్పని సరిగా నమోదులు చేయాలని సూచించారు. ఆర్టీ కార్యాలయాల్లో ఓటరు జాబితా, చెక్ లిస్ట్  అందుబాటులో ఉండాలని తెలిపారు. ఆర్డీఓ నిషిత పరిశీలన తదుపరి నామినేషన్ పత్రాలపై ధృవీకరణ చేయాలని చెప్పారు. ప్రతి రోజు నామినేషన్లు దాఖలు పై ఆర్డీఓలు నివేదికలు అందచేయాలని సూచించారు. విద్యుత్ అంతరాయం ఏర్పడితే ఇబ్బందులు రాకుండా ప్రత్యామ్నయంగా విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేయాలన్నారు.   అనంతరం నామినేషన్ పత్రాలు పూర్తింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పవర్ పాయింట్  ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.ఈ సమావేశంలో పినపాక, అశ్వారావుపేట, కొత్తగూడెం, ఇల్లందు, భద్రాచలం నియోజకర్గాల రిటర్నింగ్ అధికారులు ప్రతీక్ జైన్, రాంబాబు, శిరీష, కార్తిక్, మంగీలాల్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు దారా ప్రసాద్, డిటి రంగప్రసాద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *