ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి- జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంక
ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి
- జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంక
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్: ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అల అన్నారు. శనివారం జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంకను ఎన్నికల వ్యయ పరిశీలకులు సంజీబ్ కుమార్ పాల్, అజయ్ లాల్ చంద్ ఐడిఓసి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వ్యయ పరిశీలకులకు ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థుల యొక్క వ్యయాల లెక్కలు నమోదుకు సహాయ వ్యయ పరిశీలకులు, వీడియో సర్వేలేన్స్ టీములు, ఎన్నికల నియమావళి అమలుకు చేపట్టిన చర్యలను కలెక్టర్ వివరించారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలను పురస్కరించుకుని జిల్లాలోని ఐదు నియోజకవర్గాలు ఉన్నాయని, వాటిలో పినపాక, భద్రాచలంలకు అజయ్ లాల్ చంద్, కొత్తగూడెం, ఇల్లందు, అశ్వారావుపేట నియోజక వర్గాలకు సంజీబ్ కుమార్ పాల్ వ్యయ పరిశీలకులుగా ఎన్నికల సంఘం నియమించినట్లు తెలిపారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కమిటీలను నియమించినట్లు తెలిపారు. అభ్యర్థులు, ఆయా పార్టీల ఎన్నికల వ్యయాన్ని లెక్కించేందుకు ఏర్పాటు చేసిన కమిటీలు ఇప్పటికే క్షేత్రస్థాయి నుండి అన్ని విధాలుగా పరిశీలన జరుపుతున్నారన్నారు. సెన్సిటివ్ నియోజకవర్గాలైన ఇల్లందు, కొత్తగూడెం నియోజకవర్గాలలో అదనపు సహాయ వ్యయ పరిశీలకులను, విడియో వ్యూయింగ్ టైములను ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లా సరిహద్దు లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పటిష్ట పర్యవేక్షణ చేస్తున్నామని, వాహనాలను నిశిత పరిశీలన చేస్తూ నగదు, మద్యం, ఇతర వస్తువుల రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఎఫ్ఎస్ టీ, ఎస్ఎస్టీ బృందాలు నిరంతరం సోదాలు నిర్వహిస్తూ నగదును స్వాధీనం చేసుకుంటున్నాయని అన్నారు. నగదుకు సంబంధించి ఆధారాలు కలిగి ఉన్న వారికి గ్రీవెన్స్ కమిటీ ద్వారా పరిశీలన జరిపించి నగదును తిరిగి అందజేస్తున్నామని తెలిపారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించేందుకు వీలుగా సి-విజిల్, 1950 టోల్ ఫ్రీ నెంబర్ కు వచ్చిన ఫిర్యాదులు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఫిర్యాదులు అందిన వెంటనే ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలు తక్షణం స్పందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. టీముల వాహనాలకు జీపీఆర్ఎస్ ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. అలాగే సరిహద్దున గల మహారాష్ట్ర నుండి మద్యం, ఇతర వస్తువులను జిల్లాకు అక్రమంగా తరలించకుండా సరిహద్దు ప్రాంతాల్లో నాలుగు చోట్ల అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను ఏర్పాటు చేసి సి.సి కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నామని అన్నారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు మాట్లాడుతూ ఓటర్లను ప్రలోభాలకు గురికాకుండా చేపట్టిన చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైతే ఎక్కువ సంఖ్యలో నిఘా బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. పోటీ చేయు అభ్యర్థులు ప్రత్యేకంగా ప్రారంభించిన బ్యాంకు ఖాతా నుండి చెల్లింపులు జరిగేలా చూడాలని తెలిపారు. బ్యాంకుల ద్వారా పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీలతో పాటు యూపీఐ ద్వారా జరిగే నగదు చెల్లింపులను సైతం నిశితంగా పరిశీలించాలని సూచించారు. ఎన్నికల్లో మద్యం, నగదు పంపిణీ జరుగకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలన్నారు. ఆర్టీసీ బస్సుల సైతం తనిఖీ చేయాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని తెలిపారు. ఈ సమావేశంలో పినపాక నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రతీక్ జైన్, వ్యయ నియంత్రణ నోడల్ అధికారులు వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర రెడ్డి, లైజన్ అధికారులు సంజీవ రావు, సీతారాం నాయక్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు దారా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.