ఎన్నికల సంఘ మార్గదర్శకాలను పాటిస్తూ విధులను నిర్వర్తించాలి
ఎన్నికల సంఘ మార్గదర్శకాలను పాటిస్తూ విధులను నిర్వర్తించాలి
- వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో అధికారులు, సిబ్బంది ఎన్నికల సంఘ మార్గదర్శకాలను పాటిస్తూ విధులను నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఎన్నికల పరిశీలకులు అజయ్ వి.నాయక్, దీపక్ మిశ్ర, ఆర్ బాలకృష్ణన్, రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్, అదనపు సీఈఓ లు లోకేష్ కుమార్, సర్ఫరాజ్ అహ్మద్ తదితర అధికారులతో కలిసి జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల, ఎస్పి డాక్టర్ వినీత్ సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ నామినేషన్స్ ప్రక్రియ ముగిసిన తర్వాత పోటీలో ఉండే అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా అవసరమైన మేర ఈవిఎం యంత్రాలు సర్దుబాటు చేయాల్సి ఉంటుందని చెప్పారు. అవసరమైతే అదనపు బ్యాలెట్ యూనిట్లను జిల్లాకు అందించడం జరుగుతుందని చెప్పారు. నవంబర్ 18న రెండవ దశ ఈవీఎం యంత్రాల ర్యాండమైజేషన్ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పెండింగ్ ఓటరు నమోదు దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో బాగంగా తనిఖీలలో పట్టుబడిన నగదు, బంగారం, ఇతర ఆభరణాలు సీజ్ చేసి ఈ.ఎస్.ఎం.ఎస్ యాప్ లో నమోదు చేయాలని అన్నారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి నిర్వహించే సమావేశాలు, సభలకు రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల నుంచి వచ్చే దరఖాస్తులకు సకాలంలో అనుమతులు మంజూరు చేయాలని అన్నారు. జిల్లాలో ఓటర్ స్లిప్పులు త్వరగా ముద్రించి పంపిణీ చేసే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పారు. ఓటరు స్లిప్పుల పంపిణీ నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ ముగిసిన వెంటనే ప్రారంభించాలన్నారు. ఓటరు స్లిప్పులు పంపిణీ ప్రక్రియ పర్యవేక్షణకు జిల్లాలో నోడల్ అధికారిని నియమించాలని, ప్రతిరోజు ఓటర్ స్లిప్పుల పంపిణీ పై సమీక్ష నిర్వహించాలని అన్నారు. గతంలో తక్కువ పోలింగ్ నమోదైన పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి పోలింగ్ శాతం పెంచేందుకు విస్తృతంగా స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ప్రింటు, ఎలక్ట్రానిక్, కేబుల్, సిటి, సోషల్ మీడియాలో వచ్చే పెయిడ్ న్యూస్, అడ్వర్ టైజ్ మెంట్లు నిశిత పరిశీలన చేయాలన్నారు. అనంతరం జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అల మాట్లాడుతూ రాజకీయ పార్టీలు, అభ్యర్థులు అనుమతులు జారీలో ఎలాంటి జాప్యం జరుగకుండా జారీ చేయాలని చెప్పారు. అనుమతులు జారీ చేయుటపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎన్నికల విభాగం తహసీల్దార్ దారా ప్రసాద్, డిటి రంగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.