ఎమ్మెల్యేగా గెలిపించండి.. సేవకుడిగా పనిచేస్తా…లింగాల కమల్ రాజు
ఎమ్మెల్యేగా గెలిపించండి.. సేవకుడిగా పనిచేస్తా…
– బిఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్ రాజు
మధిర, శోధన న్యూస్ : సామాన్య కుటుంబాలనుంచి వచ్చిన తాను ఈ ప్రాంత ప్రజల కష్టసుఖాలు సమస్యలు తెలిసిన వానిగా మరోసారి మీ ముందుకు వచ్చానని, తనకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే మీలోనే ఉంటూ మీకోసం పనిచేస్తానని, ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధిలో భాగస్వామినౌతానని మధిర బిఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్ రాజు ప్రజలను కోరారు. గురువారం మధిర అసెంబ్లీ స్థానానికి బిఆర్ఎస్ అభ్యర్థిగా తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ముందుగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్యకర్తలతో కలిసి ర్యాలీగా నామినేషన్ కేంద్రానికి వెళ్లారు. నామినేషన్ అనంతరం స్థానిక పార్టీ కార్యాలయంలో రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావుతో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో లింగాల కమల్ రాజ్ మాట్లాడుతూ మధిర నియోజకవర్గంలో ఈ సారి జరగబోయే ఎన్నికల్లో ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిగా తన పట్ల ప్రజలు మద్దతుగా నిలవనున్నారని అన్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మధిరకు చేసింది శూన్యమని, కనీసం ప్రజలకు అందుబాటులో కూడా లేరని అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం ప్రతిపక్షాలకు అవకాశాలు ఇవ్వకుండా అనేక పథకాలను ప్రవేశపెట్టారన్నారు. సీఎం కేసీఆర్ తనపై నమ్మకంతో ఇచ్చిన అవకాశాన్ని నాలుగేళ్లుగా ప్రజల కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం జిల్లా పరిషత్ చైర్మన్ గా పని చేశానని, తన పనిని విశ్వసనీయతను గుర్తించి మధిర శాసనసభ్యునిగా పోటీ చేసేందుకు తనకు మరో అవకాశాన్ని కల్పించారని లింగాల తెలిపారు. సామాన్యుడైన తనకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని ప్రజలు ఎంతో ఆకాంక్షతో ఉన్నారన్నారు. ఈ దఫా జరగబోయే ఎన్నికల్లో మధిర గడ్డపై గులాబీ జెండా ఎగుర వేద్దాం అన్న ఆకాంక్ష లక్ష్యం పార్టీ శ్రేణుల్లోనూ ప్రజల్లోనూ కనిపిస్తున్నదని ఆయన అన్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరావు మాట్లాడుతూ నిరంతరం ప్రజల మధ్య నుండే లింగాల కమల్ రాజుని గెలిపించాలని ఆయన కోరారు. కమల్ రాజ్ గెలిస్తే మధిర మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు.ముఖ్యమంత్రి ఇప్పటికే కొనసాగిస్తున్న సంక్షేమ పథకాలను మరింత చేరువ చేసే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసరా పెన్షన్లతో పాటు రూ.400కే గ్యాస్ సిలిండర్ ప్రతి మహిళకు 3000 రూపాయల పెన్షన్ రైతుబంధు కింద 16 వేల రూపాయలను అందించేందుకు సిద్ధమయ్యారని ప్రజలు ఆలోచించి తమ ఓటును సద్వినియోగం అయ్యే దిశగా బిఆర్ఎస్ పార్టీకి వేయాలని కోరారు. అమలు చేస్తున్న అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు రానున్న ఎన్నికల్లో లింగాల కమల్ రాజుని గెలిపిస్తాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డి సీసీబీ ఉపాధ్యక్షులు దొండపాడు వెంకటేశ్వరావు, ఆత్మ కమిటీ చైర్మన్ గుర్రం రామారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ బంధం శ్రీనివాసరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు చిత్తారి నాగేశ్వర రావు, మండల, పట్టణ అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, కనుమూరి వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.