ఖమ్మంతెలంగాణ

మధిర పోలింగ్ కు  సర్వం సిద్దం 

మధిర పోలింగ్ కు  సర్వం సిద్దం 

మధిర, శోధన న్యూస్:  ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూసిన శాసనసభ ఎన్నికలు రానే వచ్చాయి. ఈనెల 30న జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఖాజీపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం నుంచి సిబ్బంది పోలింగ్ మెటీరియల్ తో బుధవారం వారి పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. మధిర నియోజకవర్గంలో మధిర, ఎర్రుపాలెం, బోనకల్, చింతకాని, ముదిగొండ మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 221326 మంది ఉన్నారు. వారిలో మహిళలు 114206 మంది ఉండగా, పురుషులు 107111మంది, థర్డ్ జెండర్లు 9 మంది ఉన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 44 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వాటి పరిధిలో 95 బూత్ లు ఉన్నాయి. సాధారణ పోలీసు సిబ్బందితోపాటు ఈ కేంద్రాల్లో సీఆర్పిఎఫ్ సిబ్బంది 60 మంది, ఒరిస్సా స్పెషల్ ఫోర్స్ సిబ్బంది 130 మంది ఉన్నారు. మధిర నియోజకవర్గంలో 152 పోలింగ్ కేంద్రాలు, వాటిలో 268 బూత్ లు ఉన్నాయి. ఈ కేంద్రాలకు తరలి వెళ్ళేందుకు 25 రూట్లుగా విభజించారు. ఎన్నికల సిబ్బందితోపాటు ఎన్నికల సామాగ్రిని తరలించేందుకు 75 బస్సులను ఏర్పాటు చేశారు. వాటికి రూటు ఇన్చార్జిలను 25 మందిని ఏర్పాటు చేశారు. 600 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. 268 ఈవీఎంలతో పాటు అదనంగా 40 ఈవీఎంలను అందుబాటులో ఉంచారు. పోలింగ్ మెటీరియల్ పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్, ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ సందర్శించారు. ఎన్నికల, పోలీస్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని  వారికి తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేసినట్లు రిటర్నింగ్ అధికారి గణేష్ తెలిపారు. మధిర సర్కిల్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు మధిర సీఐ జాటోత్ వసంత్ కుమార్ ఆధ్వర్యంలో పటిష్ట పోలీసు బందోబస్తుతో ఎన్నికల సిబ్బందిని, ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *