తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు – భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ వినీత్

 

  శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు…

 – భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ జి వినీత్

చర్ల, శోధన న్యూస్:   జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నేడు జరిగే తెలంగాణ సార్వత్రిక ఎన్నికలకు అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ జి వినీత్ వెల్లడించారు.నేడు జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఆయన మండలంలోని మారుమూల ఏజెన్సీ అటవీ  ప్రాంత గ్రామాలైన ఉంజుపల్లి, పూసుగుప్ప, తిప్పాపురం తదితర గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి,ఎన్నికల అధికారులకు,పోలీస్ అధికారులకు తగు సూచనలు చేశారు.అలాగే మంగళవారం మండల పరిధిలోని పూసుగుప్ప అటవీ ప్రాంతం వద్ద నిషేధిత మావోయిస్టులు ధాన్యం లోడుతో వెళ్తున్న లారీని ఆపి ధాన్యం కిందకు దింపి,లారీకి నిప్పంటించి దగ్ధం చేసిన ప్రదేశాన్ని సందర్శించారు.అనంతరం చర్ల పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో నేడు జరిగే సార్వత్రిక ఎన్నికలకు అన్ని నియోజకవర్గాల పరిధిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు, దీనికిగాను జిల్లా పోలీసులు, సిఆర్పిఎఫ్ బలగాలు,22 మిలటరీ కేంద్ర బలగాలను సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు.జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.జిల్లాలో 965 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు,వాటిలో 226 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుండి నేటి వరకు జిల్లాలో మూడు కోట్ల 20 లక్షల 50 వేల రూపాయలు సీజ్  చేసినట్లు, 2105 లీటర్ల లిక్కర్ ని స్వాధీనం చేసుకున్నట్లు, కోటి రూపాయల విలువ గల గంజాయిని, 42 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. అలాగే రౌడీ షీటర్ లాంటి గత నేర చరిత్ర కలిగిన 3500 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. చర్ల మండల పరిధిలో 15 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులకు తగు సూచనలు చేసినట్లు వెల్లడించారు. మంగళవారం మండల పరిధిలోని పూసుగుప్ప అటవీ ప్రాంతంలో జరిగిన సంఘటన చత్తీస్ ఘడ్  రాష్ట్రానికి చెందిన నలుగురు వ్యక్తుల ఆకతాయిల పని అని తెలిపారు. చత్తీస్ ఘడ్  రాష్ట్రానికి చెందిన నలుగురు వ్యక్తులు సైకిళ్లపై వచ్చి రోడ్డుపై ఎవరూ లేని సమయంలో ధాన్యం లారీని ఆపి ఇటువంటి దుశ్చర్యకు పాల్పడి పారిపోయారని అన్నారు.తమ ఉనికి కోసమే మావోయిస్టులు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు.అటవీ ప్రాంత ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురికాకుండానిర్భయంగా ఉదయం పూట తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.ఎన్నికల జరుగుతున్న సమయంలో ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా ఓఎస్డి టి సాయి మనోహర్, భద్రాచలం ఏ ఎస్ పి  పరితోష్ పంకజ్, చర్ల సీఐ బి రాజగోపాల్, ఎస్సైలు టివిఆర్ సూరి,నర్సిరెడ్డి,వెంకటప్పయ్య, పలువురు పోలీస్ అధికారులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *