రాష్ట్ర మంత్రివర్గంలో మధిరకి అగ్ర స్థానం
రాష్ట్ర మంత్రివర్గంలో మధిరకి అగ్ర స్థానం
-రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, రెవిన్యూ శాఖ మంత్రిగా మల్లు భట్టి విక్రమార్క
మధిర, శోధన న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మధిర నియోజకవర్గానికి అగ్ర స్థానం దక్కింది. మధిర నియోజకవర్గం నుండి నాలుగోసారి గెలిచిన మల్లు భట్టి విక్రమార్క గురువారం రాష్ట్ర గవర్నర్ తమిళసై ద్వారా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, రెవిన్యూ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మల్లు భట్టి విక్రమార్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆదిలాబాద్ నుండి ఖమ్మం వరకు 109 రోజులు 1365 కిలోమీటర్లు మండుటెండలో పాదయాత్ర చేసి కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతన ఉత్సవాన్ని నింపారు. పార్టీకి విధేయుడుగా ఉంటూ, క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా, పార్టీ సిద్ధాంతాలను అనుసరించే వ్యక్తిగా భట్టి విక్రమార్కకు పార్టీ అధిష్టానం వద్ద మంచి గుర్తింపు ఉంది. ఉన్నత చదువు చదివి దళిత మేధావిగా గుర్తింపు పొందిన రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో ప్రభుత్వంపై పోరాడిన మల్లు భట్టి విక్రమార్క సేవలను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరణి స్థానంలో భూమాత పథకాన్ని ప్రవేశపెడతామని ప్రకటించింది. ఈ క్రమంలో భూములపై మంచి అవగాహన కలిగిన భట్టి విక్రమార్కకు రెవిన్యూ శాఖ మంత్రి పదవి కట్టబెట్టింది. విక్రమంలో భట్టి విక్రమార్క కు ప్రాముఖ్యత కలిగిన రెవిన్యూ శాఖను అప్పగించి సమర్థవంతమైన సేవలను అందించేందుకు ప్రణాళిక తయారు చేసింది. గత పునర్విభజనలో మధిర ఎస్సీ రిజర్వేషన్ కు కేటాయించిన తర్వాత తొలిసారిగా మధిర నియోజకవర్గం నుండి గెలుపొందిన మల్లు భట్టి విక్రమార్క కి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వంటి కీలక పదవి లభించింది. ఇది మధిర నియోజకవర్గానికి దక్కిన అరుదైన గౌరవంగా భావించాలి. రాష్ట్రంలో తొలిసారిగా 1952 నుండి జరిగిన అసెంబ్లీ ఎన్నికలు మొదలుకొని 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు మధిర నియోజకవర్గం నుండి పదిమంది వివిధ పార్టీల నుండి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. తొలి ఎమ్మెల్యేగా1952 లో పిడిఎఫ్ పార్టీ నుండి కొండబోలు వెంకయ్య గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి బొమ్మకంటి సత్యనారాయణ, దుగ్గినేని వెంకయ్య, దుగ్గినేని వెంకట్రావమ్మ, బండారు ప్రసాదరావు, శీలం సిద్ధారెడ్డి, సిపిఎం నుండి బోడేపూడి వెంకటేశ్వరావు, కట్టా వెంకట నరసయ్య, టీడీపీ నుంచి కొండబాల కోటేశ్వరరావు గెలుపొందారు. 71 సంవత్సరాలు మధిర అసెంబ్లీ లో గెలుపొందిన ఎవరికి మంత్రి యోగం దక్కలేదు. ఆ అరుదైన గౌరవం మధిర నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున నాలుగో సారి గెలుపొందిన ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క కే దక్కటం విశేషం. మల్లు భట్టి విక్రమార్క 2000 నుండి 2003 వరకు పిసిసి కార్యదర్శిగా పదవీ బాధ్యతలు నిర్వహించారు. 2007లో ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నుండి పోటీ చేసిన మల్లు భట్టి విక్రమార్క ఘన విజయం సాధించారు. నియోజకవర్గాలు పునర్విభజన కావడంతో 2009 మధిర నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ అయింది. దీంతో తొలిసారిగా మల్లు భట్టి విక్రమార్క 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు. 2009 నుండి 2011 జూన్ 3న చీప్ విఫ్ విధులు, 2014 లో డిప్యూటీ స్పీకర్ గా, 2014 ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందిన భట్టి విక్రమార్క కాంగ్రెస్ శాసన సభాపక్ష ఉప నాయకుడిగా, 2015లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, 2018 ఎన్నికలకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ గా పనిచేశారు. 2018 ఎన్నికల్లో పోటీ చేసి మూడోసారి గెలుపొందిన మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఆయన ఎనలేని కృషి చేశారు. ఆయన సేవలను గుర్తించిన అధిష్టానం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టి సముచిత స్థానం కల్పించింది. మధిర నుండి నాలుగో సారి గెలిచిన మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా, రెవెన్యూ శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.