భూములకు పరిహారం అందించాలని రైతులు ఆందోళన
భూములకు పరిహారం అందించాలని రైతులు ఆందోళన
కొణిజర్ల, శోధన న్యూస్ : ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురం సమీపంలోని గోద్రెజ్ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం గిరిజన రైతుల వద్ద తీసుకున్న భూములకు పరిహారం తగిన రీతిలో అందించలేదని నిరసిస్తూ ఆదివారం ఫ్యాక్టరీ ముందు గిరిజన రైతులు నిరసనకు దిగారు.తమకు ఈ భూమి ఆధారమని చెప్పినప్పటికీ అధికారులు ప్రజాప్రతినిధులు తమను ఒప్పించి గిరిజన రైతులమైన మమ్మలను నానా విధాలుగా ఇబ్బందులకు గురిచేసి ఒప్పించారని అయినా 30 లక్షల రూపాయలు ఇస్తామని ఎకరానికి హామీ ఇచ్చి కేవలం 20 లక్షలరూపాయల మాత్రమే ఇచ్చి పట్టించుకోవటం లేదని అందుకే ఈనాడు ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తపరిచారు.తమ భూములకు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రకారం మిగతా డబ్బులు కూడా ప్రతి రైతుకు అందించాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళన చేశారు.జిల్లా కలెక్టర్ ఆర్డీవో సైతం రైతులు దగ్గర తీసుకున్న భూములకు న్యాయమైన రేటును ప్రకటిస్తామని చెప్పి ఫ్యాక్టరీ యాజమాన్యం వద్ద ఎకరానికి 27 లక్షల రూపాయలు చొప్పున నగదు తీసుకొని రైతులకు అకౌంట్లో ఎకరానికి 20 లక్షలు రూపాయలు జమ చేశారని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. మా ప్రాంతంలో ఎకరం 50 లక్షల వరకు డిమాండ్ ఉందని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తమ భూములను ఇచ్చామని తమకు న్యాయమైన రేటు ఇవ్వకుండా మోసం చేశారని గిరిజన రైతులు అధికారులు తీరుపై విమర్శలు చేశారు. తమకు నష్టపరిహారం చెల్లించేంతవరకు ఫ్యాక్టరీ పనులను అడ్డుకుంటామని రైతులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రైతులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.