తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

ప్రజాపాలన దరఖాస్తులకు ఆదాయం, కమ్యూనిటీ సర్టిఫికెట్లు జత పరచాల్సిన అవసరం లేదు  -భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక 

ప్రజాపాలన దరఖాస్తులకు ఆదాయం, కమ్యూనిటీ సర్టిఫికెట్లు జత పరచాల్సిన అవసరం లేదు 

-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక 

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : ప్రజాపాలన దరఖాస్తులకు ఆదాయం, కమ్యూనిటీ సర్టిఫికెట్లు జత పరచాల్సిన అవసరం లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ ఆధార్ కార్డుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మార్పు, సవరణలు అవసరం లేదని, ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్, ఒక పాస్ ఫోటో పెడితే సరిపోతుందని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో ఆంద్రప్రదేశ్, ఖమ్మం జిల్లా ఉంటే దరఖాస్తులు తీసుకోరని, ఆదాయం, కుల ధ్రువీకరణలు అడుగుతున్నారని వచ్చే పుకార్లను నమ్మొద్దని తెలిపారు. ఏదేని సలహాలు, సూచనలు. కొరకు ప్రజలు హెల్ప్ డెస్క్ లేదా రెవెన్యూ, ఎంపిడిఓ, ఎంపిఓ, గ్రామ కార్యదర్శి, అంగన్వాడీ సిబ్బంది, మహిళా స్వయం సహాయక సంఘ  సభ్యులను సంప్రదించాలన్నారు. అసత్య ప్రచారాలు నమ్మొద్దని ఆమె స్పష్టం చేశారు. ఇతర వివరాలకు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూము 08744-241950కు కార్యాలయ పని వేళల్లో ఫోన్ చేసి సంప్రదించవచ్చని తెలిపారు. ప్రజాపాలన రెండవ రోజు
74 గ్రామ పంచాయతీల్లోను, మూడు మున్సిపల్ వార్డులలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి 34995 గృహాల లబ్ధిదారుల నుండి 44711 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల నుండి విశేషమైన స్పందన వస్తున్నదని తెలిపారు. ప్రజాపాలన గ్రామసభల్లో దరఖాస్తులు స్వీకరణలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని తెలిపారు. నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఈ నెల 28వ తేదీన ప్రారంభమైన ప్రజాపాలన 481 గ్రామపంచాయతీలు, నాలుగు  మున్సిపాలిటీలలో జరుగుతున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్లుగా పటిష్ట ఏర్పాట్లు చేయాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణ ద్వారా అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వం మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలకు మంజూరుకు చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు.
రెండవ రోజు 74 గ్రామపంచాయతీలు, 3 మున్సిపాలిటీ వార్డుల్లో గ్రామసభలు నిర్వహించామని, 34995 కుటుంబాల నుండి 44711 దరఖాస్తులు స్వీకరించామన్నారు. స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు బాధ్యతగా రసీదు అందజేయడంతో పాటు ప్రత్యేకంగా రిజిస్టర్ లో నమోదులు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి రోజు రెండు షిప్టులలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఇంటికి ప్రజాపాలన దరఖాస్తులు ఉచితంగా అందచేస్తున్నామన్నారు. ప్రజలు దళారుల మోసపూరిత మాటలను నమ్మొద్దని ఆమె సూచించారు. దరఖాస్తులు నింపుటకు ప్రజల సహాయార్థం ప్రతి కౌంటర్లో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటుతో పాటు ప్రభుత్వ యంత్రాంగపు సలహాలు, సూచనలు అందిస్తున్నట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య వార్తలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాటిని నమ్మొద్దని తెలిపారు ఎవరైనా జిరాక్స్ అవసరం ఉంటే నామమాత్రపు   ధర మాత్రమే తీసుకోవాలని, అధికంగా వసూలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదుతో పాటు సంబంధిత జిరాక్స్ కేంద్రం అనుమతులు రద్దు చేయడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. జిరాక్స్ కేంద్రాలపై పర్యవేక్షణ చేయాలని, ఎవరైనా ఎక్కువ వసూలు చేస్తే సంబంధిత తహసీల్దార్, ఎంపిడిఓ, ఆర్డిఓ కార్యాలయంలో పిర్యాదు చేయాలని తెలిపారు. మూడవ రోజు న తేదీ 30వ తేదీన యధావిధిగా గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గ్రామ సభలు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయని ఆమె తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *