వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను పూర్తి చేయాలి -ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపి గౌతమ్
ప్రభుత్వ ఆసుపత్రి భవన మిగులు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
-ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపి గౌతమ్
మధిర, శోధన న్యూస్:
ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవన నిర్మాణ మిగులు పనులు త్వరితగతిన పూర్తి చేసి, ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ తెలిపారు. సోమవారం మధిర పట్టణంలో రూ. 34 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పెయింటింగ్ పనులు చివరి దశలో ఉన్నట్లు, శానిటేషన్ పనులు ఫర్నిచర్ పనులు, విద్యుద్దీకరణ, ఇతరత్రా పనులు 15 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఆసుపత్రికి చేరుకున్న సామాగ్రిని ఆయన పరిశీలించారు. ఆసుపత్రికి ఇంకా రావాల్సిన పరికరాలు, కావాల్సిన పరికరాల నివేదిక సమర్పించాలన్నారు. అనంతరం మినీ స్టేడియంను సందర్శించి పరిశీలించారు. మిగులు పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. 400 మీటర్ల అథ్లెటిక్ ట్రాక్, క్రికెట్ పిచ్ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. లాంగ్ జంప్ కోర్ట్, అవుట్ డోర్ ఖోఖో కోర్ట్ పనుల్లో వేగం పెంచాలన్నారు. ప్రభుత్వ కళాశాల, డిగ్రీ కళాశాలలో శిథిలావస్థలో ఉన్న భవన కూల్చివేత చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, డిసిహెచ్ఎస్ డా. వెంకటేశ్వర్లు, జిల్లా యువజన సంక్షేమ, క్రీడల అభివృద్ధి అధికారి సునీల్ రెడ్డి, ఆరోగ్య శాఖ ఇఇ ఉమామహేశ్వర రావు, డిఇ విద్యాసాగర్, వైద్యాధికారులు, తదితరులు ఉన్నారు.