రూ.27 కోట్ల నిషేధిత గంజాయి దహనం
రూ.27 కోట్ల నిషేధిత గంజాయి దహనం
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 17 పోలీస్ స్టేషన్లలో 142 కేసుల్లో వివిధ సందర్భాల్లో నిందితుల వద్ద నుండి సీజ్ చేసిన రూ.27కోట్ల విలువ చేసే 11,061 కిలోల నిషేధిత గంజాయిని మంగళవారం హేమచంద్రాపురం గ్రామ శివార్లలోని నిర్మానుష్య అటవీ ప్రాంతంలో డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో దహనం చేసినట్లు జిల్లా ఎస్పీ, జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ రోహిత్ రాజు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా ఒకే రోజు దశల వారీగా నిషేధిత గంజాయిని దహనం చేసిన ఘనతను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు దక్కిందన్నారు. కోర్టు వారి ఉత్తర్వుల మేరకు ఈ నిషేధిత గంజాయిని ఈ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు దశల వారీగా విభజించి దహనం చేయడం జరిగింది.ముందుగా డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ అయిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పోలీస్ స్టేషన్ల వారీగా కొన్ని భాగాలుగా విభజించిన గంజాయిని హెడ్ క్వార్టర్స్ నందు తూకం వేసి పరిశీలించారు. అనంతరం దహనం కొరకు సిద్ధం చేసిన మొత్తం గంజాయిని దగ్గర్లోని అటవీ ప్రాంతానికి తరలించి తగలబెట్టడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కొందరు అక్రమార్జనలో భాగంగా గంజాయిని విక్రయిస్తూ పట్టణ,గ్రామీణ ప్రాంతాల్లోని యువతను ప్రలోభాలకు గురి చేస్తూ మత్తులోకి దించుతున్న వారిని అరికట్టడం కోసం జిల్లా పోలీస్ శాఖలో రహస్య బృందాల్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎవరైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఎస్పీ రోహిత్ రాజుతో పాటు ఓఎస్డి సాయి మనోహర్, ఏఎస్పీ పరితోష్ పంకజ్, పాల్వంచ డిఎస్పీ వెంకటేష్, మణుగూరు డిఎస్పీ రాఘవేంద్రరావు, డీసిఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామి, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.