తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

ఈవీఎం గోదామును పరిశీలించిన జిల్లా కలెక్టర్

Collector inspected the EVM warehouse
ఈవీఎం గోదామును పరిశీలించిన జిల్లా కలెక్టర్

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్: ఎన్నికల ప్రక్రియలో ఈవిఎం మొదటి దశ పరిశీలన అత్యంత ప్రధానమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. బుధవారం కొత్తగూడెం ఆర్డిఓ కార్యాలయంలో బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వివిఫ్యాట్ మొదటి దశ పరిశీలనతో పాటు ఈవిఎం గోదామును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ.. భద్రాద్రి జిల్లాకు ఎన్నికల సంఘం కేటాయించిన 1588 బ్యాలెట్ యూనిట్లు, 1424 కంట్రోల్ యూనిట్లు అలాగే 1683 వివి పాట్లు మొదటి దశ పరిశీలన చేపట్టినట్లు తెలిపారు. సిసి టివి పర్యవేక్షణలో గురువారం వరకు పరిశీలన ప్రక్రియ మొత్తం పూర్తి అవుతుందన్నారు. మొదటి దశ ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం ఈవిఎం, కంట్రోల్ యూనిట్లు, వివి పాట్లు ఈవిఎం గోదాములో భద్రపరచనున్నట్లు తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈవిఎం పరిశీలన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పరిశీలనలో ఈసిఐఎల్ కు చెందిన సాంకేతిక నిపుణుల బృందం పనితీరును క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందన్నారు. గోదాముకు జరుగుతున్న మరమ్మత్తు పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, ఆర్ అండ్ బి ఈఈ వెంకటేశ్వర రావు, కొత్తగూడెం తహసిల్దార్ పుల్లయ్య, ఎన్నికల విభాగం నాయబ్ తహసీల్దార్ రంగా ప్రసాద్, సిబ్బంది నవీన్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *