మధిర రహదారులకు మహర్దశ
మధిర రహదారులకు మహర్దశ
-నిర్మాణ పనులకు రూ. 334 కోట్లు మంజూరు
-తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
మధిర , శోధన న్యూస్ : మధిర నియోజకవర్గం లోని రహాదారులకు మహర్దశ పట్టనుంది. నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో అగ్రభాగాల నిలిపేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శ్రీకారం చుట్టారు. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లేని పరిస్థితుల నుండి 2009లో నియోజకవర్గాల పునర్విభజన తో మధిర శాసనసభ్యునిగా పోటీ చేసి విజయం సాధించిన తర్వాత మారుమూల ప్రాంతంగా ఉన్న మధిరకు సుమారు రూ.1800 కోట్లతో అభివృద్ధికి బాటలు వేసిన ఘనత భట్టి విక్రమార్కకే దక్కింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ల కాలంగా అభివృద్ధికి ఆమడ దూరంలో నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గానికి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరుగుతుందని, అది కేవలం భట్టి విక్రమార్కతోనే సాధ్యమన్న నమ్మకాన్ని ఆయనపై ఉంచి గెలుపుకు కృషి చేసిన ప్రజల కు ఇచ్చిన మాట మేరకు తొలివిడతగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల లోపే 334 కోట్ల రూపాయలను గ్రామీణ రహదారుల నిర్మాణానికి కేటాయించడం మధిర అభివృద్ధిపై ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా ఆర్థిక శాఖ మంత్రిగా కీలక భూమిక పోషిస్తున్న ఆయన రాష్ట్ర సమగ్ర అభివృద్ధి తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిలో భాగంగా నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులు రహదారుల విస్తరణాలు విద్య ఉద్యోగ ఉపాధి రంగాల పై ప్రత్యేక ప్రణాళికతో ముందడుగు వేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. గడిచిన 15 ఏళ్లుగా శాసనసభ్యునిగా కొనసాగుతున్న ఆయన రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై సమగ్రమైన ఆలోచనల మేరకు అన్ని రంగాల్లో అన్ని నియోజకవర్గాలకు సముచిత అభివృద్ధికి నిధుల మంజూరు కు ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా ప్రతి నియోజకవర్గంలో 100 కోట్లతో ఇంటిగ్రేటెడ్ గురుకుల కళాశాల ఏర్పాటుకు అడుగులు వేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో మధిర నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ కళాశాల ఏర్పాటుకు త్వరలోనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భూమి పూజ చేయనున్నారు.