విద్యా వ్యవస్థను బలోపేతం చెసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి -డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క
విద్యా వ్యవస్థను బలోపేతం చెసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి
-డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క
భద్రాచలం, శోధన న్యూస్ : గిరిజన కుటుంబాలకు మేలు జరిగే విధంగా విద్యా, వైద్యం, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలలో విద్యా వ్యవస్థను బలోపేతం చెసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఐటీడీఏ పాలకవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా గిరిజన గ్రామాలలో నివసించే ఆదివాసి గిరిజనులకు గిరిజన పిల్లలకు విద్యా వైద్యం ఉపాధికి బాటలు వేసే విధంగా ఐటిడిఏ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, ఐటీడీఏ పరిధిలో గిరిజన జీవన స్థితిగతులు మెరుగుపడాలంటే విద్య అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రెసిడెన్షియల్ ఆశ్రమ ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. 10 వ తరగతి ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు ఉన్నత చదువులకు అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు. ఇట్టి విషయమై విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. జూనియర్ కళాశాలలో విద్యార్థుల ఉత్తీర్ణ శాతం పెంచాలని, ఇంటర్ నుండే ఉన్నత చదువులకు వెళ్లేందుకు విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. విద్యార్థులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన అన్నారు. పోడు భూములల్లో వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులకు 2005 సంవత్సరం ఆగస్టు 9వ మూడున్నర లక్షల ఎకరాలకు సోనియా గాంధీ, ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్న సమయంలో దివంగతులైన సీఎం రాజశేఖర్ రెడ్డి హయాంలో పోడు పట్టాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అలాగే ఆ రోజులలో పాఠశాలలు, హాస్టల్స్ లో స్వయంగా పరిశీలించి సమస్యలన్నీ తెలుసుకొని మౌలిక వసతులు కల్పించడం జరిగిందని ఆయన అన్నారు. మారుమూల గిరిజన గ్రామాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యుల సమస్య మరియు ఏఎన్ఎం, అంబులెన్స్ సమస్య ఉన్నట్లు మా దృష్టికి వచ్చినందున, ప్రస్తుతం రిమోట్ ఏరియా పి హెచ్ సి లలో సరిపడే సిబ్బంది లేకపోతే లోకల్ గా ఉన్న నిరుద్యోగ గిరిజన యువతి యువకులకు కాంట్రాక్టు బేస్ పై నియమించి గిరిజనులకు వైద్య సేవలు అందే విధంగా చూడాలని చెప్పారు. 100 పడకల ఆస్పత్రి మొదలుకొని పీహెచ్సీలలో అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని 24 గంటలు పని చేసే విధంగా సంబంధిత వైద్య అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన అన్నారు. ఐటీడీఏలు అభివృద్ధి చెందడానికి అన్ని విధాల చర్యలు చేపడతామని ముఖ్యంగా గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పండ్ల తోటల పెంపకం కొరకు ప్రతి మండలంలో ఫ్రూట్ ప్లానిషన్స్ విరివిగా చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. గిరిజన రైతులకు అధిక శాతం నిధులు కేటాయించి ఆయిల్ ఫామ్ సాగుకు ఆర్థికపరమైన వెసులుబాటు కల్పిస్తామన్నారు. ఆ దిశగా గిరిజన రైతుల కొరకు జిల్లా కలెక్టర్, ప్రాజెక్ట్ అధికారి దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే గిరిజన రైతుల భూ సమస్యలు పరిష్కరించి భూ పంపిణీ చేసి వ్యవసాయం అభివృద్ధికి పాటుపడతామని ఆయన అన్నారు. ఇందిర జలప్రభ కార్యక్రమంలో గిరిజన రైతులకు సబ్సిడీపై కరెంటు మోటార్లు భూముల అభివృద్ధి చేయడం జరిగిందని, మరల ఆ పథకాన్ని పున ప్రారంభించడానికి వాటికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ తయారు చేసే పంపిస్తే త్వరలో ఇందిరా జల ప్రభ పథకాన్ని ప్రారంభిస్తామని ఆయన అన్నారు. అలాగే గిరిజన గ్రామాలలోని రైతులకు పాసుబుక్కుల విషయంలో చాలా సమస్యలు ఉన్నాయని ఆ సమస్యలు తీర్చడానికి ధరణి కమిటీని వేశామని కమిటీ ద్వారా రిపోర్టు రాగానే భూ సమస్య అనేది పరిష్కారం చేస్తామని, భద్రాచలంలోని గోదావరి కరకట్టను పెంచడానికి కృషి చేస్తామని గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఆటంకం కలిగించకూడదని గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అలాగే అంగన్వాడి కేంద్రాల్లో పని చేసే టీచర్లకు ఆయాలకు పెండింగ్ వేతనాలు త్వరలో అందే విధంగా చర్యలు తీసుకుంటామని మహిళా సంఘాల గ్రూపులకు వడ్డీ లేని రుణాలు అందించి సంఘాలు బలోపేతం అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. గిరిజన గ్రామాలలో ఉన్న ప్రజా ప్రతినిధులు ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ జిల్లా అధికారుల సమన్వయంతో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కలిసికట్టుగా సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ సమావేశంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, పార్లమెంటు సభ్యులు కవిత, శాసనసభ్యులు రాందాస్ నాయక్, పాయం వెంకటేశ్వర్లు, కూనంనేని సాంబశివరావు, జారి ఆదినారాయణ, కోరం కనకయ్య, తెల్లo వెంకటరావు ఎమ్మెల్సీ తాతా మధు, జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, ప్రియాంక అలా, ఐటీడీఏ ప్రతిక్ జైన్, ఓ ఎస్ డి కృష్ణ భాస్కర్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ తదితరులు పాల్గొన్నారు.