సంక్షేమ పథకాలు అర్హులైన గిరిజన కుటుంబాలకు అందేలా కృషి – ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్
సంక్షేమ పథకాలు అర్హులైన గిరిజన కుటుంబాలకు అందేలా కృషి
– ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్
భద్రాచలం, శోధన న్యూస్ : భద్రాచలం ఐటీడీఏ ద్వారా గిరిజనుల అభివృద్ధి కొరకు ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అర్హులైన గిరిజన కుటుంబాలకు అందే విధంగా కృషి చేస్తున్నామని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటిడిఎ సమావేశం మందిరంలో ఏర్పాటుచేసిన పాలకవర్గ సమావేశంలో ఐటీడీఏ ద్వారా గిరిజనుల కొరకు ప్రవేశపెట్టిన సమగ్ర సమాచారాన్ని ఆయన గౌరవ మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసి గిరిజన గ్రామాలలో ముఖ్యంగా విద్యా వైద్యం పోడు భూముల సమస్యలు గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం అలాగే ట్రైకార్ ద్వారా 80% సబ్సిడీపై రుణాల వెసులుబాటు కల్పించడం జరుగుతుందని ఆయన అన్నారు. గిరిజన విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో 24 ప్రాథమిక ఉన్నత పాఠశాలలో రెండు గిరిజన వసతి గృహాలు 10 గిరిజన కళాశాల వసతి గృహాలు 11 పనిచేస్తున్నాయని తెలిపారు. గిరిజన విద్యాభివృద్ధి కొరకు అనేక చర్యలు చేపడుతున్నామని అన్నారు. భద్రాచలం పరిధిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఒకటి, సాధారణ ఆసుపత్రి ఒకటి, ఏరియా ఆసుపత్రి రెండు, సామాజిక ఆసుపత్రిలో ఎనిమిది, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 38, ఆరోగ్య ఉప కేంద్రాలు 329, పల్లె దవఖానాలు 193, బస్తీ దవాఖానాలు, అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్స్ నాలుగు, గిరిజన నర్సింగ్ ట్రైన్ స్కూల్ ఒకటి పనిచేస్తున్నాయని తెలిపారు. అత్యవసర వాహనాలు 108 వాహనంలో 27, 102 వాహనం 24 గిరిజనుల అత్యవసర సేవల కొరకు వినియోగిస్తున్నామని అన్నారు. అలాగే ట్రై కార్ ద్వారా 2020-21 సంవత్సరానికి 330 స్కీములకు గాను 228 గ్రౌండ్ చేయడం జరిగిందని, ప్రతి యూనిట్‌కి 80% సబ్సిడీపై రుణాలు అందించడం జరిగిందని తెలిపారు. మిగిలిన యూనిట్లను త్వరగా గ్రౌండ్ చేసి దశలవారీగా వారికి కూడా రుణాలు అందించడం జరుగుతుందని, గ్రౌండింగ్ అయిన యూనిట్లకు బ్యాంకర్ సమస్య లేకుండా మండలాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి యూనిట్ సభ్యుల సమక్షంలో చర్చించి అర్హులైన ప్రతి యూనిట్‌కు రుణాలు అందిస్తున్నామని తెలిపారు. అలాగే నిరుద్యోగులైన గిరిజన యువతీ యువకులను మండలాల వారీగా గుర్తించి వారికి వైటిసి ద్వారా ప్రత్యేక శిక్షణలో ఇప్పించి ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని గిరిజన రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా కరెంటు మోటారు బోరు పూర్తిస్థాయి సబ్సిడీతో వేయించడం జరుగుతుందని అన్నారు. అలాగే పోడు భూములకు పట్టాలు అందించడానికి ఫారెస్ట్ వారి సమస్య లేకుండా అర్హులైన ప్రతి గిరిజన రైతులకు పట్టాలు అందిస్తున్నామని, గిరిజనులకు మత్స్య సొసైటీలు ఏర్పాటు చేసి సబ్సిడీ ద్వారా వారికి చేపలు పట్టుకోవడానికి వాటికి సంబంధించిన సామాన్లు మరియు మార్కెట్ సౌకర్యం కల్పించడం జరిగిందని అన్నారు. ఐటీడీఏ ద్వారా ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకం అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు అందించడానికి ఐటీడీఏ యూనిట్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. అనంతరం ట్రై కార్ ద్వారా ఎం ఎస్ ఎం ఈ 9 పథకాలకు కోటి 29 లక్షల రూపాయలు సబ్సిడీతో దానికి సంబంధించిన చెక్కును లబ్ధిదారులకు మంత్రులు అందించారు. ఐటీడీఏ పాలకవర్గ సమావేశం కార్యక్రమానికి ముఖ్యంగా గిరిజన సంక్షేమం మరియు గిరిజన అభివృద్ధి గిరిజనుల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన పాలకవర్గ సమావేశానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రులకు, జడ్పీ చైర్ పర్సన్ లకు, ఎమ్మెల్సీలకు, ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనసభ్యులకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా కలెక్టర్లకు, జిల్లా అధికారులకు అందరికీ పేరుపేరునా హృదయపూర్వక శుభాభినందనలు తెలిపారు.