కానిస్టేబుల్ ను సన్మానించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
వ్యక్తి ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ ను సన్మానించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : దమ్మపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తూ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్బంగా బందోబస్త్ నిమిత్తం వెళ్లిన కానిస్టేబుల్ నాగముత్యం అక్కడ ఆకస్మాత్తుగా గుండెపోటుతో పడిపోయిన వ్యక్తికి సిపిఆర్ చేసి ప్రాణాలను కాపాడిన సంగతి విధితమే. సమయస్పూర్తితో వ్యవహరించి ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ నాగముత్యంను బుధవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తన కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ నిత్యం ప్రజలకు సేవలు అందించడంలో ముందుండే పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ వైద్య పరంగా కూడా కొన్ని ప్రాధమిక విషయాలను తెలుసుకుని ఉండాలని సూచించారు. ముఖ్యంగా పోలీసు అధికారులు,సిబ్బంది సిపిఆర్ విధానాన్ని తెలుసుకుని ఉండాలని,ఇందులో భాగంగా సిపిఆర్ గురించి జిల్లాలోని పోలీస్ అధికారులు,సిబ్బందికి శిక్షణను అందించేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. తోటి వారి ప్రాణాలను కాపాడటంలో పోలీసులే కాకుండా సామాన్య ప్రజలు కూడా సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ భాద్యతగా మెలగాలని,అందుకోసం ప్రతి ఒక్కరూ ప్రధమచికిత్సకు సంభందించి కొన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలని ఈ సందర్బంగా విజ్ఞప్తి చేశారు.