తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి.

రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా

భద్రాద్రి కోత్తగూడెం, శోధన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం లోతు వాగు రైతు వేదిక వద్ద రైతు నేస్తం వర్చువల్ విధానంలో నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం రైతుల ముంగిట అందిస్తూ తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు రైతులకు అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ రైతు వేదిక వద్ద వర్చువల్ విధానంలో నిర్వహించిన రైతు నేస్తం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలో ఒక రైతు వేదిక వద్ద వీడియో కాన్ఫెరెన్స్ వ్యవస్థ ఏర్పాటు చేసి డిజిటల్ ప్లాట్ ఫారం ద్వారా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం రైతుల ముంగిట అందించే రైతు నేస్తం కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు సమస్యలను క్షేత్ర స్థాయిలో తెలుసుకుంటూ వారి సమస్యలకు పరిష్కారం చూపేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. పంట వేసే సమయంలో రైతులకు వచ్చే సమస్యలను దృష్టిలో పెట్టుకుని వారికి తగిన సలహాలు, సూచనలు అందించడం జరుగుతుందని తెలిపారు. శాస్త్రవేత్తలు, అధికారులు, రైతుల మధ్య ప్రత్యక్ష పరస్పర విషయ మార్పిడికి రైతు వేదికలలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థతో జూమ్, యూట్యూబ్ లైవ్ ద్వారా లింక్ చేయడం జరుగుతుందని తెలిపారు. శాస్త్రవేత్తలు రైతులతో క్షేత్రస్థాయి సమస్యలపై ముఖాముఖిగా చర్చించి, అవసరమైన సలహాలు అందిస్తారని, ముందస్తుగా రాష్ట్రవ్యాప్తంగా 110 రైతు వేదికలలో ఈ వ్యవస్థ ఏర్పాటు చేశామని, దశలవారీగా ప్రతి రైతు వేదికలో ఈ వ్యవస్థ తీసుకొని వస్తామని సీఎం తెలిపారు. రైతుల పొలాలు దున్నడం నుంచి పంట చేతికి వచ్చి మార్కెటింగ్ చేసే వరకు ప్రతి దశలో రైతులకు సహకారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, రైతులకు లాభసాటి ధరలు లభించేలా చూస్తుందని అన్నారు. రైతు భరోసా, రుణమాఫీ, విత్తనాలు అందుబాటులోకి తీసుకురావడం, ఐకెపి సెంటర్ల ద్వారా పంట కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ నేలలపై దాదాపు 26 రకాల పంటలు సాగు చేసుకునే అవకాశం ఉందని, వరి, పత్తి, మిర్చి వంటి పంటలకు పరిమితం కాకుండా ఇతర పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని, పంట మార్పిడి విధానాన్ని అమలు చేయాలని, తక్కువ పెట్టుబడితో రైతులకు అధిక లాభాలు వచ్చేలా అవసరమైన సహకారం అందించేందుకు రైతు నేస్తం కార్యక్రమం దోహదపడుతుందని అన్నారు. రైతుల కోసం ప్రభుత్వం పంటల భీమా పథకాన్ని తీసుకొని వస్తుందని, కరువు, వరద వంటి పరిస్థితులలో పంట నష్టం జరగకుండా పంటల భీమా పథకం ఉపయోగపడుతుందని అన్నారు. కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకల మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, రైతులు సాగు చేసే ప్రతి దశలో తమ ప్రభుత్వం అండగా ఉంటుందని, రైతులకు అవసరమైన సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానం ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ విద్యాచందన, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబు రావు , డిసిఎంఎస్ కే శ్రీనివాసరావు, కొత్తగూడెం సొసైటీ చైర్మన్ ఎం హనుమంతరావు, వ్యవసాయ శాఖ ఏఈఓ లు, ఏఓ లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *