పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : ఈనెల 18వ తేదీ నుండి జిల్లాలోని 73 కేంద్రాలలో జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు జరిగే కేంద్రాలలో పారిశుద్ధ్యం, తాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యం తప్పనిసరిగా ఉండేటట్లుగా సంబంధిత ఎంపీడీవోలు శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సంబంధిత గ్రామపంచాయతీ సిబ్బందితోను, ఎంపీడీవో తోను సంప్రదించి పాఠశాలల్లో ప్రతిరోజు పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని, త్రాగునీటికి, టాయిలెట్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా పరీక్షా పత్రాల గోప్యత ను పర్యవేక్షించునున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రశ్నాపత్రాలను సురక్షితంగా పోలీస్ స్టేషన్ నుండి పరీక్షా కేంద్రాలకు తరలించడం, జవాబు పత్రాలను పరీక్షా కేంద్రాల నుండి పోస్ట్ ఆఫీస్ కు సురక్షితంగా తరలించటం లో సంబంధిత చీఫ్ సూపర్డెంట్లు పూర్తి బాధ్యత వహించాలని కేంద్రాల సూపర్డెంట్ లను ఆదేశించారు. పరీక్షల నిర్వహణ కొరకు 73 మంది చీఫ్ సూపర్డెంట్లు, 73 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 720 మంది ఇన్విజిలేటర్ లు, ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేసినట్లు, ప్రతి కేంద్రంలో ఆరోగ్య సిబ్బంది ఉండేటట్లుగా చర్యలు లేకుండా తెలిపారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కు అవకాశం లేకుండా పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించి జిల్లాకు మంచి పేరు తేవాలని అధికారులను ఆదేశించారు. పిల్లలందరూ ఎటువంటి భయం లేకుండా, ఒత్తిడికి గురికాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో పరీక్షలు రాసి మంచి ఫలితాలను సాధించాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ ఎం వెంకటేశ్వర చారి, అన్ని మండలాల ఎంపీడీవోలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, డి ఆర్ డి ఓ విద్యా చందన పాల్గొన్నారు.