తెలంగాణవరంగల్

నగదు లావాదేవీలు నిబంధన ప్రకారం జరగాలి

నగదు లావాదేవీలు నిబంధన ప్రకారం జరగాలి

-హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

వరంగల్(హన్మకొండ), శోధన న్యూస్ : ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నిబంధనల మేరకే నగదు లావాదేవీల నిర్వహణ ఉండాలని బ్యాంకర్లకు  హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. బుధవారం సాయంత్రం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని వివిధ బ్యాంకర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ 50వేల రూపాయలకు మించి నగదును తీసుకునే ఖాతాదారులకు సూచనలు చేయాలని పేర్కొన్నారు. బ్యాంకు శాఖల మధ్య జరిగే నగదు రవాణా ఎన్నికల నిబంధనల మేరకు తూచా తప్పకుండా పాటించాలి అన్నారు. అనుమానాస్పద లావాదేవీల పై బ్యాంకర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాంటి లావాదేవీలను జిల్లా ఎన్నికల అధికారికి నివేదించాలన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే బ్యాంకర్లు పోస్టల్ బ్యాలెట్ కు దరకాస్తు చేసుకోవాలని అన్నారు. బ్యాంకర్లు ఓటరు గుర్తింపు కార్డులను పొంది పోస్టల్ బ్యాలెట్కు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కోరారు. లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ బ్యాంకర్లు బ్యాంకులకు నగదు తరలించేటప్పుడు, తీసుకువచ్చేటప్పుడు నిబంధనలు తప్పకుండా పాటించాలని అన్నారు. నగదు తరలింపు గురించి వాహనాల నంబర్లతో పాటు ఎంత నగదు తరలిస్తున్నారనే సమాచారాన్ని సీ-విజిల్ యాప్ లో నమోదు చేయాలన్నారు. జిల్లా పరిధిలో, ఇతర జిల్లాలకు నగదు ను తరలించేటప్పుడు అందుకు సంబంధించిన సరైన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు రాధిక గుప్తా, వెంకట్ రెడ్డి, డిఆర్వో వై.వి. గణేష్, ఎస్బీఐ, యూబీఐ, ఏపీజీవీబీ, కెనరా, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *