ప్రతి ఇంటికి త్రాగు నీరు అందేలా చర్యలు తీసుకోవాలి
ప్రతి ఇంటికి త్రాగు నీరు అందేలా చర్యలు తీసుకోవాలి
–ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
ములుగు, శోధన న్యూస్ : ప్రస్తుత వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటూ గ్రామాలలోని ప్రతి ఇంటింటికి తాగునీరు అందించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నీటి ఎద్దడి సమస్య ఉన్నా గ్రామాలను గుర్తించి ప్రతి ఇంటికి నీరు అందేలా చూడాలని, వేసవికాలంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున గ్రామాలలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా చూస్తూ రాబోయే మూడు నెలల లో గ్రామాలలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీరు అందించాలని అన్నారు. ఏజెన్సీ గ్రామాలలో మిషన్ భగీరథ, వాటర్ ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేయాలని, అటవీ ప్రాంతంలో ఉండే గిరిజనులకు గ్రామపంచాయతీ వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని అందించాలని సూచించారు. అధికారులు గ్రామాలలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి గ్రామాలలో ఉండే మోటార్ పంపులు, చేతిపంపులను పరిశీలించి చెడిపోయిన వాటికి వెంటనే మరమ్మతు చేయాలని ఆదేశించారు. ప్రజలు వేసవి కాలంలో అప్రమత్తంగా ఉండాలని నీటిని పొదుపుగా ఉపయోగించుకోవాలని,వేసవి కాలంలో భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని తద్వారా భూగర్భ జలాలను పెంపొందించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.అనంతరం ధర్మవరం లోని వాటర్ ట్యాంకు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ పనులలో వేగం పెంచి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఏప్రిల్ 25 తేదిలోపు పూర్తి చేసి వాటర్ ట్యాంకు ద్వారా నీటి సరఫరా జరగాలని సంబంధిత అధికారులకు తెలిపారు.