ఖమ్మంతెలంగాణ

ఓటు హక్కు ప్రాముఖ్యత పై  5 కే రన్

ఓటు హక్కు ప్రాముఖ్యత పై  5 కే రన్

-రన్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ 

ఖమ్మం ,శోధన న్యూస్: ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వీలుగా భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో మంగళవారం ఉదయం ‘ఐ ఓట్ ఫర్ షూర్’ అనే నినాదంతో నిర్వహించిన 5కె రన్ ఉత్సాహంగా సాగింది. వివిధ వర్గాల వారు స్వచ్చందంగా 5కె రన్ లో పాల్గొని ప్రజాస్వామ్య పరిణతి చాటారు. వివిధ శాఖల అధికారులతో పాటు యువజన సంఘాల ప్రతినిధులు, విద్యార్థిని విద్యార్థులు, యువతీ యువకులు పెద్ద ఎత్తున 5కె రన్ లో భాగస్వాములయ్యారు. 5కె రన్ విజయవంతానికి ముందస్తుగానే అధికారులు విస్తృత స్థాయిలో చేపట్టిన ఏర్పాట్లు సత్ఫలితాలు ఇచ్చాయి. సర్దార్ పటేల్ స్టేడియం నుండి చేపట్టిన 5కె రన్ ను జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్, మునిసిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెకర్స్ సత్యప్రసాద్, మధుసూదన్ నాయక్, జెండా ఊపి ప్రారంభించారు. ఐ ఓట్ ఫర్ షూర్ అనే నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ వివిధ వర్గాల వారు సర్దార్ పటేల్ స్టేడియం నుంచి లకారం పార్క్ వరకు పరుగు నిర్వహించారు. పరుగులో ప్రతిభ కనబరిచిన నలుగురికి జిల్లా కలెక్టర్ నగదు బహూకరించారు. అనంతరం అందరూ కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కు వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 5కె రన్ లో వెయ్యి మంది యువత పాల్గొన్నారని, వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఓటర్ గా పేరు నమోదు చేసుకోవాలని, నమోదు చేయడానికి ఏప్రిల్ 14 లాస్ట్ డేట్ అని, నమోదయిఉంటే ఓటు హక్కుని తప్పనిసరిగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి మే 13వ తారీకు ఉపయోగించుకోవాలని సూచించారు. సి విజిల్ యాప్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని, ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని, రాజకీయ నాయకులు ప్రలోభాలకు గురి చేస్తే ఒక ఫోటోతీసి పంపిస్తే టీం వెంటనే అక్కడికి వెళ్లి వాళ్ళని అదుపులోకి తీసుకుంటుందన్నారు. మునిసిపల్ కమిషనర్ ఆదర్శ సురభి మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలని, 13వ తేదీన జరిగే ఎన్నికల్లో వినియోగించుకోవాలని కోరారు. ఓటరు హెల్ప్ లైన్ యాప్ ద్వారా వారి ఓటు హక్కు ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చని, సి విజిల్ యాప్ ద్వారా అవినీతి అక్రమాలను అరికట్టవచ్చని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *