బడుగు వర్గాల ఆశాజ్యోతి బాబా సాహెబ్ అంబేద్కర్
బడుగు వర్గాల ఆశాజ్యోతి బాబా సాహెబ్ అంబేద్కర్
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : అంటరాని తనం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురైన అవమానాలకు ఆయధంగా మలచుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి అయ్యారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐ డి ఓ సి సమావేశ మందిరంలో నిర్వహించిన వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి, అబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ ఒక్క రోజే కాదని ప్రతి రోజు ఆ మహానీయుని తలచుకోవాలని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో మనందరం నడవాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. సమాజంలో ఎవరికి ఎవరు తక్కువ కాదని సమతావాదాన్ని చాటి చెప్పిన మహా మేధావి అంబేద్కర్ అని అన్నారు. ప్రజలు స్వేచ్ఛగా జీవించడానికి కావాల్సిన అన్ని హక్కులు రాజ్యాంగంలో పొందుపరిచారని చెప్పారు. అంబేద్కర్ ఒక వర్గానికి చెందిన వారు కాదని, అందరి వాడని తెలిపారు. సమాజిక ఆర్థిక రంగాలకు ఎన్నో సేవలు అందించారని, ఆర్బిఐ ఏర్పాటుకు మూలకారకులు అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ జయంతి మనందరికి పెద్ద పండుగ అని చెప్పారు. మహానీయుల సిద్దాంతాలు నేటి తరాల వారు తెలుసుకోవాలని తెలిపారు. మనందరి అరాధ్యదైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. మానవాళికి దిశానిర్ధేశం చేసిన మహానీయుడు అని కొనియాడారు. మానవాళి జీవన మనుగడ ముందుకు సాగేందుకు ఆయన జీవితం ఆదర్శమన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధునిక ప్రపంచానికి మార్గ నిర్దేశం చేశారని తెలిపారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అని, అన్ని రంగాలకు ఆరాధ్యుడని తెలిపారు. సామాజిక రుగ్మతలను అనుభవించి భావితరాల భవిష్యత్తుకు రుగ్మతలు అడ్డుకారాదని హక్కులు కల్పించారని చెప్పారు. చదువే మార్పుకు మూలమని, ప్రతి ఒక్కరూ మంచిగా చదువుకోవాలని తెలిపారు. చదువు మనిషికి మూడో నేత్రమని కలెక్టర్ తెలిపారు.