శ్రీరామనవమి వేడుకల దిగ్విజయం పట్ల హర్షం
శ్రీరామనవమి వేడుకల దిగ్విజయం పట్ల హర్షం
-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
భద్రాచలం, శోధన న్యూస్ : శ్రీరామనవమి మహోత్సవ వేడుకలు దిగ్విజయంగా నిర్వహించడం పట్ల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సిఎస్ వేడుకలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం పట్ల దేవస్థానం కమిషనర్ హనుమంతరావు ను, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల ను, ఎస్పి రోహిత్ రాజ్ ను అభినందించారు. వేసవి దృష్ట్యా సెక్టార్ లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా శాంతి భద్రతల పర్యవేక్షణ, చలువ పందిళ్లు, కూలర్లు, మంచినీరు, మజ్జిగతో పాటు అత్యవసర వైద్య సేవలకు అత్యవసర వైద్య చికిత్స కేంద్రాలు, అంబులెన్స్ లు, నిరంతరాయ విద్యుత్, పకడ్బందీ పారిశుద్ధ్య కార్యక్రమాలు, సమాచార కేంద్రాలు, తలంబ్రాలు, ప్రసాదాల కౌంటర్లు, వాహనాల పార్కింగ్ దిగ్విజయంగా ఏర్పాటు చేశారని జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల నేతృత్వంలో జిల్లా యంత్రాంగం సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసారని, ఇది జిల్లా యంత్రాంగం సమిష్టి కృషికి భక్తుల నుండి లభించిన గౌరవమని అన్నారు. స్వామి వారి వేడుకలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వీక్షించేందుకు ప్రత్యక్ష ప్రసారం చేశామని, తద్వారా భద్రాచలం రాలేకపోయిన భక్తులు దేశ, విదేశాల నుండి సీతారాముల కల్యాణ వేడుకలు కనులారా వీక్షించారని సిఎస్ పేర్కోన్నారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నదని, దాదాపు నెల రోజుల ముందు నుండే అన్ని శాఖలను సమన్వయం చేస్తూ జిల్లా కలెక్టర్ చక్కటి కార్యాచరణ ప్రణాళికతో విజయవంతం చేశారని అభినందించారు. ఇదే స్ఫూర్తితో 18వ తేదీన జరుగుతున్న మహా పట్టాభిషేకం కార్యక్రమాలు వీక్షణకు విచ్చేయు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లుతో సిద్ధంగా ఉండాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.