ఎన్నికల పట్ల అధికారులు అవగాహన కలిగి ఉండాలి
ఎన్నికల పట్ల అధికారులు అవగాహన కలిగి ఉండాలి
ఖమ్మం ,శోధన న్యూస్: ఎన్నికల విధుల పట్ల పూర్తి అవగాహన కలిగివుండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారులకు ఏర్పాటుచేసిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి పాల్గొని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్, 85 ఏండ్లు పైబడిన దివ్యాoగులకు హోం ఓటింగ్ సౌకర్యాన్ని ఎన్నికల సంఘం కల్పించిందన్నారు. మూడు రోజుల పాటు, ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు హోం ఓటింగ్ నిర్వహించబడుతుందన్నారు. హోం ఓటింగ్ రూట్ షెడ్యూల్ ను పొలిటికల్ పార్టీలకు, పోటీచేసే అభ్యర్థులకు ముందుగా తెలియపర్చాలన్నారు. హోం ఓటింగ్ లో ఓటింగ్ గోప్యత పాటించాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ ను మే 4 నుండి మే 8 వరకు చేపట్టనున్నట్లు, ఇందుకై నియోజకవర్గ ప్రధాన కార్యస్థానాల్లో ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఖమ్మం నియోజకవర్గ పరిధిలో ఓటు ఉన్న సిబ్బందికి ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ జారీ చేస్తారని, ఇతర నియోజకవర్గాల్లో ఓటు ఉన్న పోస్టల్ బ్యాలెట్ జారీ చేస్తారని తెలిపారు. ప్రతిరోజు హోం, పోస్టల్ బ్యాలెట్ ల వివరాలు సంబంధిత ఏఆర్ఓ కు సమర్పించాలన్నారు. బ్యాలెట్ పేపర్ లో ఓటింగ్ విషయమై చేయాల్సిన, చేయకూడని పనులపై ఫ్లెక్సీ ని ఫెసిలిటేషన్ కేంద్రాల్లో ప్రదర్శించాలన్నారు. స్ట్రాంగ్ రూం లు తెరవడం, మూయు సందర్బంలో ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటించాలన్నారు.