ఎన్నికల్లో అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలి
ఎన్నికల్లో అవాంచనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి
-నేర విచారణలో జాప్యం వహిస్తే సహించేది లేదు
– భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ .. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులంతా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలకు పోలింగ్ రోజున సమయాన్ని తెలియజేస్తూ ఓటు వేసే విధంగా అవగాహన కల్పించి ఓటింగ్ శాతాన్ని పెంచే విధంగా కృషి చేయాలని తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని అన్నారు. దొంగతనం కేసుల్లో చోరీ సొత్తును రికవరీ చేసి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలన్నారు. గంజాయి లాంటి మత్తు పదార్ధాలను రవాణా చేసే వారితో పాటు సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహారించాలని తెలిపారు. మట్కా,జూదం,బెట్టింగు లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అట్టి వ్యక్తులపై చట్ట ప్రకారం కేసుల నమోదు చేయాలని తెలిపారు. సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేసుకుని వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తూ ఉండాలని తెలిపారు. సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించే వ్యక్తుల పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.