పోలింగ్ ప్రక్రియకు కట్టుదిట్టమైన చర్యలు
పోలింగ్ ప్రక్రియకు కట్టుదిట్టమైన చర్యలు
– భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : నేటి పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 2500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు, జిల్లా వ్యాప్తంగా భద్రతాపరమైన అన్ని రకాల చర్యలను పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదివారం తెలిపారు. నేటి ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జిల్లాలోని 971 పోలింగ్ కేంద్రాలలో జరగబోయే ఓటింగ్లో ప్రజలంతా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, మంటను ప్రేరేపించే వస్తువులకు అనుమతి లేదన్నారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ ను ఖచ్చితంగా అమలయ్యే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించే వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాలలో గానీ, పరిసర ప్రాంతాల్లో గానీ ఓటర్లను ప్రలోభ పెట్టె వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా ఎవరైనా నగదు, మద్యం ఇతరత్రా వస్తువులను ఎవరైనా పంపిణీ చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 కి ఫోన్ చేసి గానీ, సీ-విజిల్ యాప్ ద్వారా గానీ ఫిర్యాదు చేసి సమాచారం అందజేయాలని కోరారు. పోలింగ్ కేంద్రాల నుండి 100 మీటర్ల దూరంలో ఎవరూ ఉండరాదని, ఎన్నికల నియమావళి ప్రకారం పోలీసులు చేపట్టే చర్యలను అతిక్రమిస్తే అట్టి వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కావున ప్రజాస్వామ్య బద్ధంగా జరిగే పోలింగ్ ప్రక్రియకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.