పోలింగ్ అధికారుల పనితీరు భేష్
పోలింగ్అ ధికారుల పనితీరు భేష్
– జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అలా
భద్రాచలం , శోధన న్యూస్ : ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అత్యంత సమస్యత్మక ప్రాంతమైన మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని భద్రాచలం నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సజావుగా జరగడానికి కృషి చేసిన స్థానిక ఏఎస్పీ పారితోష్ పంకజ్, భద్రాచలం ఆర్డీవో, ఎన్నికల రిటర్నింగ్ అధికారి దామోదర్ రావు మరియు పోలింగ్ సిబ్బందికి ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అన్నారు. సోమవారం రాత్రి భద్రాచలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ పూర్తికాగానే పోలింగ్ సామాగ్రి తీసుకొని వచ్చిన పోలింగ్ సిబ్బంది నుండి పోలింగ్ సామాగ్రి ఈవీఎం మిషన్స్ వివి ప్యాట్లు తీసుకొని భద్రపరిచిన సామాగ్రిని రికార్డులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భద్రాచలం నియోజకవర్గంలో 176 పోలింగ్ కేంద్రాలలో సెక్టార్ల వారీగా వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్ళిన పోలింగ్ సిబ్బంది పోలింగ్ ప్రక్రియ ప్రారంభానికి ముందు ఉదయం 5:30 గంటలకు ఏజెంట్లు సమక్షంలో మాక్ పోల్ నిర్వహించి , 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ పర్సంటేజ్ ను జిల్లా పోలింగ్ అధికారికి పంపించడంతో ఆ నియోజకవర్గము యొక్క పోలింగ్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జరుగుతుందని పై అధికారుల దృష్టికి రావడం చాలా సంతోషమని అన్నారు.
మారుమూల సమస్యాత్మక మండలాలైన చర్ల, దుమ్ముగూడెం పోలింగ్ కేంద్రాలలో సెక్టార్లకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ ప్రక్రియ ముగియగానే ప్రత్యేక పోలీస్, సిఆర్పిఎఫ్ బలగాల సెక్యూరిటీతో పోలింగ్ సామాగ్రిని ముందుగా తెప్పించుకోవడంతో ఎటువంటి తప్పిదాలు జరగలేదని అన్నారు.. ప్రతి సెక్టార్ రూటుల వారీగా పోలింగ్ స్టేషన్లను బట్టి సిబ్బందిని చేరవేయడానికి రెండు బస్సుల చొప్పున కేటాయించి, 176 పోలింగ్ స్టేషన్లకు గాను 25 మంది సెక్టర్ అధికారులు, 120 మంది మైక్రో అబ్జర్వర్లు ,ప్రతి పోలింగ్ స్టేషన్ కు పిఓలు, ఏపీవోలు, ఓపిఓలు మరియు రిజర్వుగా పోలింగ్ సిబ్బందితో కలిపి 844 మందిని పంపడంతో పోలింగ్ ప్రక్రియ చాలా సులభంగా జరిగిందని అన్నారు. అదేవిధంగా సెక్టార్ల వారీగా తిరిగి పోలింగ్ సిబ్బందిని తీసుకొని రావడం జరిగిందని అన్నారు. ఎన్నికల విధులకు వెళ్లే పోలింగ్ స్టేషన్లకు ఎండాకాలం ను దృష్టిలో పెట్టుకొని వారు అలసటకు గురికాకుండా ముందు జాగ్రత్తగా గ్లూకోస్ డి పాకెట్లు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు ప్రతి పోలింగ్ స్టేషన్ కు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు.
అలాగే పోలింగ్ స్టేషన్లలో కరెంటు, మంచినీటి సౌకర్యంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని, పోలింగ్ స్టేషన్ల వారీగా నియమించబడ్డ సెక్టర్ అధికారులు వారి రూటులవారీగా పోలింగ్ సిబ్బందిని తీసుకొని రావడం జరిగిందని,సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ అయిపోయే సమయంలో ఓటర్లు కొన్ని పోలింగ్ స్టేషన్లలో ఓటు వేయడానికి లైన్ లో ఉండడంతో వారికి ప్రత్యేకంగా తయారు చేసిన స్లిప్పులను అందించి ఓటింగ్ ప్రక్రియ అయిపోగానే సామాన్లన్నీ జాగ్రత్తగా తీసుకొని భద్రత నడుమ సిబ్బందిని తీసుకొని రావడం జరిగిందని, సెక్టరల్ అధికారుల నుండి మొదలుకొని పి ఓ లు, ఏపీవోలు ,ఓపిఓలు మరియు పోలింగ్ స్టేషన్లో వివిధ పనులకు నియమించిన సిబ్బంది అందరూ కలిసికట్టుగా ఉండి పోలింగ్ ప్రక్రియ ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ జరిగే విధంగా కృషి చేశారని ఆమె అన్నారు.
పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటింగ్ ప్రక్రియ జరిగిన ఈవీఎం మిషన్లు వివి పాట్లు ఇతర సామాగ్రి అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేవా సరిచూసుకొని వివి ప్యాట్లు ఈవీఎం మిషన్ల సీలు ఏ ఆర్ ఓ పరిశీలించి వాటిని పెట్టెలలో భద్రపరిచి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కు ప్రత్యేక భద్రత నడుమ తీసుకొని వెళ్లి స్ట్రాంగ్ రూములలో చేరవేయాలని అన్నారు. అనంతరం పోలింగ్ కు సంబంధించిన రికార్డులను పరిశీలించి ఎటువంటి తప్పిదాలు లేకుండా అన్ని పూరించి భద్రపరచాలని అన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించిన పోలింగ్ సిబ్బందితో పాటు సెక్టరల్ అధికారులకు ఎన్నికల సామాగ్రి చేరవేయడానికి పనులు చేసిన వర్కర్లకు అలాగే పోలీస్, సిఆర్పిఎఫ్ జవాన్లకు, వైద్య బృందానికి, గ్రామపంచాయతీ వర్కర్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీనివాస్ ,నయాబ్ తాసిల్దార్ ఎలక్షన్ మహిధర్, ఏఈఓ వెలుపల శ్రీనివాస్ రెవెన్యూ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.