నేడు కూర్మ జయంతి – కూర్మావతార విశిష్టత
నేడు కూర్మ జయంతి – కూర్మావతార విశిష్టత
విష్ణువు యొక్క తాబేలు రూప అవతారము. హిందూమత పురాణాల లో శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాల లో రెండవ అవతారం కూర్మావతారము. కూర్మము అనగా తాబేలు. దేవదానవులు అమృతము కోసము పాలసముద్రాన్ని మథించడానికి మందర పర్వతాన్ని కవ్వంగా నిర్ణయించి, పాలసముద్రంలో వేస్తే అది కాస్తా ఆ బరువుకి పాలసముద్రంలో మునిగిపోతుంటే, విష్ణుమూర్తి కూర్మావతారములో దానిని భరిస్తాడు. ఇది కృతయుగం లో సంభవించిన అవతారం. .అవతార గాథ
ఒకమారు దేవేంద్రుని ప్రవర్తనకు కోపించిన దూర్వాస మహర్షి “దేవతలు శక్తిహీనులగుదురు” అని శపించాడు. అందువలన దానవులచేతిలో దేవతలు పరాజయం పొందసాగారు. వారు విష్ణువుతో మొరపెట్టుకోగా “సకల ఔషధులకు నిలయమైన పాలకడలిని చిలికి అమృతాన్ని సాధించండి” అని విష్ణువు ఉపాయాన్ని ఉపదేశించాడు. దేవతలు ఆ బృహత్కార్యం కోసం అందుకు తమకంటె శక్తివంతులుగా ఉన్న దానవులతో సంధి కుదుర్చుకొన్నారు. మందర పర్వతం కవ్వంగా, వాసుకి త్రాడుగా క్షీరసముద్ర మథనం మొదలయ్యింది. కాని మందరగిరి బరువుకి మునిగిపోసాగింది. కార్యం నిష్ఫలమయ్యే పరిస్థితి ఉత్పన్నమైంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారమును ధరించి ఆ కొండను భరించెను. అలా దేవదేవుని అండతో సముద్రమథన కార్యం కొనసాగింది. ముందుగా జగములను నాశనము చేయగల హాలాహలము ఉద్భవించినది. దేవతల మొర విని, కరుణించి, పరమశివుడు హాలాహలాన్ని భక్షించి, తన కంఠంలోనే నిలిపాడు. అందుచేత ఆయనను గరళకంఠుడు అనీ, నీలకంఠుడు అనీ అంటారు. తరువాత సుర (మధువు), ఆపై అప్సరసలు, కౌస్తుభము, ఉచ్ఛైశ్రవము, కల్పవృక్షము, కామధేనువు, ఐరావతము వచ్చాయి. ఆ తరువాత త్రిజన్మోహినియైన శ్రీలక్ష్మీదేవి ఉద్భవించింది. సకలదేవతలు ఆమెను అర్చించి, కీర్తించి, కానుకలు సమర్పించుకొన్నారు. ఆమె శ్రీమహావిష్ణువును వరించింది. చివరకు ధన్వంతరి అమృత కలశాన్ని చేతబట్టుకొని బయటకు వచ్చాడు. తరువాత విష్ణువే మోహినిగా ఆ అమృతం దేవతలకు దక్కేలా చేశాడు.
. కూర్మ జయంతి నాడు “శ్రీకూర్మం” క్షేత్రాన్ని దర్శించుకోండి
శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పట్ణానికి 15 కి.మీ. దూరంలో శ్రీకూర్మం అనే పుణ్య క్షేత్రం ఉంది. శ్రీమహావిష్ణువు కూర్మావతారం రూపంలో ఇక్కడ పూజింపబడుతాడు. కూర్మావతారం మందిరం దేశంలో ఇదొక్కటే. ఆదిత్యయోగీ.కూర్మావతారుడు తన భక్తుని కోరికపై స్వయంగా వెలసిన క్షేత్రమే శ్రీకూర్మం. కృతయుగంలో శ్వేతరాజు, అతని భార్య వంశధారల తపస్సుకు, భక్తికి మెచ్చుకున్న కూర్మనాధుడు వారి కోరిక ప్రకారం ఈ క్షేత్రంలో పశ్చిమ ముఖంగా వెలిశాడట. ఈ క్షేత్ర ప్రస్తావన కూర్మ, బ్రహ్మాండ, పద్మ పురాణాలలో వుంది. శ్రీరాముడు, బలరాముడు, జమదగ్ని మొదలైన పురాణ పురుషులెందరో ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామిని ఆరాధించారని పురాణాలు చెబుతున్నాయి. ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ ఆలయంలో శిల్ప సౌందర్యం అందరినీ ఆకట్టుకుంటుంది. మరే దేవాలయంలోను లేనివిధంగా ఇక్కడ రెండు ధ్వజస్తంభాలను ఈ ఆలయంలో చూడవచ్చు. ఈ స్తంభాలు రెండూ శివ కేశవులకు ప్రతీకలుగా చెప్తారు. చెప్పడానికి ఇది వైష్ణవ క్షేత్రమే. అయినా శివ కేశవులకు చిహ్నాలుగా చెప్పే ఈ ధ్వజస్తంభాలు శివకేశవుల అభేద తత్వాన్ని సూచిస్తున్నాయి. ఈ క్షేత్రం కృతయుగం నాటిది. దేవాలయంలోని మూలవిరాట్టు సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి చేత ప్రతిష్టించబడిందట.దేవతలచే నిర్మించబడిన ఆలయం ప్రతిరోజు రాత్రివేళల్లో దేవతలు వచ్చి దేవాలయ నిర్మాణం చేసి సూర్యోదయం అయ్యే వేళకు అదృశ్యం అయిపోయేవారట. అందుకనే ఆలయంలోని స్తంభాలు ఒకదానికి మరొకటి పోలికలేని విధంగా వుంటాయని ఒక కథనం. శ్రీ కూర్మంలోని స్వామి వారి పుష్కరిణిని శ్వేతగుండం అని పిలుస్తారు. ఇది అత్యంత విశిష్టమైంది. ఆ స్వామి చేతిలోని సుదర్శనచక్రం చేత పుష్కరిణి ఆవిష్కరించబడిందనీ, అందుకే ఈ గుండంలో స్నానం చేస్తే కలిదోషాలు తొలగిపోతాయని చెప్తారు. మరణించినవారి అస్థికలను ఈ గుండంలో నిమజ్జనం చేస్తారు.
.
.