సన్న కారు రైతులను లాభదాయక సాగు పద్ధతులపై ప్రోత్సహించాలి.
సన్న కారు రైతులను లాభదాయక సాగు పద్ధతులపై ప్రోత్సహించాలి.
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వ్యవసాయ విస్తరణ అధికారులతో ఐ డి ఓ సి కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సన్నకారు రైతులతో కొత్త తరహాలో వ్యవసాయం చేయించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచే దిశలో వ్యవసాయ విస్తరణ అధికారులు కృషి చేయాలని కోరారు.
మునగ సాగు ద్వారా, మునగ కాయలు పండించి ఒక ఎకరంలో వరి సాగు కన్నా అధిక ఆదాయం సాధించవచ్చని,కామారెడ్డి జిల్లాలో నిరూపణ అయిందని, ప్రతి వ్యవసాయ అధికారి కనీసం ఒక రైతును ఆ దిశలో ప్రోత్సహించాలని ఆదేశించారు. మునగ సాగు ఒక ఎకరంలో చేపట్టి, వాటికి నీటి సరఫరాకై నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలన్నారు .
మునగ చెట్లు నాటుటకు గుంటలు, నీటి కుంటలు తవ్వుటకు ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం సాయం చేస్తుందని, మునగ చెట్లకు రక్షణగా చుట్టూ టేకు చెట్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
నీటి కుంటలలో అజోల్ల నాచు పెంపకం ద్వారా ఆదాయం పొందవచ్చని, అలాగే నీటి కుంటలలో కొర్రమీను పిల్లలను వేసి వాటి పెంపకం ద్వారా ఆదాయం పొందవచ్చని తెలిపారు.
వరి సాగు రైతులకు అంతగా లాభదాయకం కాని పరిస్థితుల్లో ఆయిల్ ఫామ్ అంతర్ పంటగా వేసుకోవచ్చని, ఆయిల్ ఫామ్ మొక్కల మధ్య అరటి సాగు చేసుకోవచ్చని తెలిపారు.
తేనెటీగల పెంపకం చేపట్టడం ద్వారా రైతుల ఆదాయం రెట్టింపు చేసేలా వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, ఉద్యానవన అధికారి సూర్యనారాయణ, జిల్లా మార్క్ఫెడ్ అధికారి సునీత, జిల్లా విత్తన అభివృద్ధి సంస్థ అధికారి బిక్షం, ఏడిఏ రవికుమార్, ఏవో దీపక్, మండల వ్యవసాయ అధికారులు, మండల విస్తరణ అధికారులు పాల్గొన్నారు.