మాదకద్రవ్యాల నిర్మూలన పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి
మాదకద్రవ్యాల నిర్మూలన పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి
-మాదకద్రవ్యాల రహిత జిల్లాగా జిల్లాగా చేయడంలో జిల్లా పోలీసు శాఖ కృషి ప్రశంసనీయం : కలెక్టర్ జితేష్.వి పాటిల్
-గంజాయి రవాణాను అరికట్టడంలో రాష్ట్రంలో మన జిల్లాదే కీలక పాత్ర : ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : మాదకద్రవ్యాల నిర్మూలన పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్బంగా కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థినీ,విద్యార్థులు పట్టణ ప్రజలతో కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి రైల్వే స్టేషన్ వరకు అవగాహనా ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్,ఎస్పీ రోహిత్ రాజు లతో పాటు జిల్లా అధికారులు , అన్ని వర్గాల ప్రజలు,విద్యార్థులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం రైల్వే స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన వేదిక ద్వారా ర్యాలీలో పాల్గొన్న అందరూ మత్తు పదార్థాల రహిత సమాజం కోసం పాటుపడతామని ప్రతిజ్ఞ చేశారు.
ర్యాలీని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ…అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ర్యాలీలో ఉత్సాహంతో పాల్గొన్న యువతను చూసి ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. శక్తివంతమైన జిల్లాగా పేరుగాంచిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మత్తు పదార్థాలను నివారించడంలో పోలీస్ శాఖ పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గమనిస్తూ ఉండాలని తెలిపారు. యువత ఎంతో బంగారు భవిష్యత్తు కలిగి ఉండవలసిన వారు కొంతమంది చెడు మార్గాల వైపు ఆకర్షితులవుతున్నారని, మత్తుకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలు సేవించేవారు వారి మానసిక స్థితిని కోల్పోయి నేరాలు చేసే అవకాశం ఉంటుందన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు మానవుల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు.యువతియువకులు మంచి అలవాట్లతో తల్లిదండ్రులు మరియు గురువుల చెప్పిన మాటలు విని చదువుతూ ముందుకు వెళితే చక్కని భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.మాదకద్రవ్యాలకు యువతను దూరంగా ఉంచాలని డ్రగ్ రహిత తెలంగాణ సమాజం కొరకు అందరూ కృషి చేయాలని సూచించారు.
అనంతరం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ…మత్తు పదార్థాల నివారణ కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. చత్తీస్గడ్,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సరిహద్దుగా గల మన జిల్లా మీదుగా జరుగుతున్న నిషేధిత గంజాయి రవాణాను జిల్లా పోలీసులు సమర్థవంతంగా ఎదుర్కోవడం జరుగుతుందని తెలిపారు.కేవలం ఈ ఆరు నెలల్లోనే 5000 కేజీల నిషేధిత గంజాయిని అక్రమ రవాణా కాకుండా నిరోధించి అక్రమార్కులపై కేసులు నమోదు చేయడం జరిగిందని సూచించారు. ఇప్పటివరకు జిల్లాలో సుమారుగా 30 వేల కేజీలకు పైగా గంజాయిని తగలబెట్టడం జరిగిందని అన్నారు.గంజాయి రవాణాను నిరోధించడంలో జిల్లా పోలీసుల కృషితో తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే అగ్రగామిగా నిలిచిందన్నారు.ఎవరైనా నిషేధిత గంజాయిని అక్రమంగా రవాణా చేసినా,సేవించినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా తెలిపారు. ఎంతోమంది యువత మత్తుకు బానిసలై తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు.మండుటెండను కూడా లెక్కచేయకుండా ఈ ర్యాలీలో పాల్గొని గంజాయి రహిత సమాజం కొరకు కదిలి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. డ్రగ్-రహిత సమాజమే లక్ష్యంగా మాదకద్రవ్యాల దుర్వినియోగం,అక్రమ రవాణాకు వ్యతిరేకంగా వారం రోజుల పాటు పట్టణాలు,మండలాలలోని పాఠశాలలు,కళాశాలలో విద్యార్థులకు విస్తృత స్ధాయిలో అవగాహనా కార్యక్రమాలు,ప్రదర్శనలు,ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు ఈ సందర్బంగా తెలిపారు.