ఈపీ ఆపరేటర్ల పదోన్నతుల నియామకపు పత్రాలు వెంటనే ఇవ్వాలి
ఈపీ ఆపరేటర్ల పదోన్నతుల నియామకపు పత్రాలు వెంటనే ఇవ్వాలి
మణుగూరు, శోధన న్యూస్ : కొత్తగూడెం రీజియన్ స్థాయి లో మణుగూరు, కొత్తగూడెం సత్తుపల్లి, ఇల్లందు ఓ సి గనులలో పనిచేస్తున్న ఈపీ ఆపరేటర్ల పదోన్నతులకు సంబంధించి ఏ గ్రేడ్ , బి గ్రేడ్ నియామకపు పత్రాలు వెంటనే ఇవ్వాలని, సీ గ్రేడ్ పదోన్నతుల ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాలని కోరుతూ మణుగూరు ఏరియా ఈపి ఆపరేటర్ల ఆధ్వర్యంలో ఏరియా డీజీఎం పర్సనల్ సలగల రమేష్ కి శనివారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆపరేటర్స్ నాయకులు ఏస్ డి నాసర్ పాషా విలేకరులతో మాట్లాడుతూ కొత్తగూడెం రీజియన్ స్థాయి ఈ పీ ఆపరేటర్ల పదోన్నతులకు సంబంధించి ఇప్పటికే ఏ గ్రేడ్, బి గ్రేడ్, ఖాళీల భర్తీ ప్రక్రియ పూర్తి అయ్యిందని, పార్లమెంటు ఎన్నికల కోడ్ నేపథ్యం లో సంబంధిత ఆపరేటర్లకు నియామకపు పత్రాలు ఇవ్వడం లో జాప్యం జరిగిందన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన నేపధ్యంలో పదోన్నతులు పొందిన ఆపరేటర్లకు నియామకపు పత్రాలు అందజేసే విధంగా ఏరియా యాజమాన్యం తగు చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే రీజియన్ స్థాయిలో డి గ్రేడ్ లో రెండు సంవత్సరాలు సర్వీస్ పూర్తిచేసిన ఆపరేటర్లకు సీ గ్రేడ్ పదోన్నతులు కల్పించేందుకు కూడా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పదోన్నతులు ఆలస్యం కావడంతో ఆర్థికంగా నష్టపోతున్నారని, భవిష్యత్తులో పొందాల్సిన పదోన్నతులపై కూడా వీటి ప్రభావం పడుతుందని తెలిపారు. ఉత్పత్తి ఉత్పాదకతలలో ప్రధాన పాత్ర పోషించే ఈపి ఆపరేటర్లకు న్యాయం చేసే విధంగా బ్యాక్ డేట్ ఇవ్వడంతో పాటు వాటి బకాయిలు కూడా చెల్లించే విధంగా యాజమాన్యం చర్యలు చేపట్టాలని కోరారు.