కొరకట్ పాడు గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్
కొరకట్ పాడు గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు చర్ల మండలం కొరకట్ పాడు గ్రామంలో చర్ల సీఐ రాజు వర్మ ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ఈ గ్రామంలో ప్రతి ఇంటిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అనంతరం గ్రామస్తులందరితో సమావేశమై అక్కడ నివసించే 40 కుటుంబాలకు దోమతెరలను పంపిణీ చేశారు. వర్షాకాలం కారణంగా డెంగ్యూ, మలేరియా లాంటి విష జ్వరాలు ప్రభలే అవకాశం ఉన్నందున ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు అండగా ఉంటూ వారికి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు దోమతెరలను పంపిణీ చేయడం జరిగిందని సిఐ రాజు వర్మ తెలిపారు. గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని, నిషేధిత మావోయిస్టులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించవద్దని గ్రామస్తులకు సిఐ సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ రాజు వర్మతో పాటు ఎస్సై నర్సిరెడ్డి, సిఆర్ పిఎఫ్ ,స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.