రాజుపేట గ్రామంలో సింగరేణి ఉచిత వైద్య శిబిరం
రాజుపేట గ్రామంలో సింగరేణి ఉచిత వైద్య శిబిరం
మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని రాజుపేట గ్రామంలో సింగరేణి సేవ సమితి మరియు సింగరేణి వైద్య,ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో ఆదివారం సింగరేణి ఉచిత వైద్య శిభిరం నిర్వహించారు. రాజుపేట గ్రామస్తులను వైద్య పరీక్షలు నిర్వహించి బిపి, షుగర్ పరీక్షలు చేయడంతో పాటు జ్వరం, కీళ్ల నొప్పులు, చర్మ వ్యాధులు, తదితర సీజనల్ వ్యాధుల నివారణకు కూడా మొత్తం 225 మందికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. రాజుపేటలో కాలువల వద్ద, పరిసర ప్రాంతాలలో బ్లీచింగ్ చల్లడం జరిగింది. ఈ సందర్భంగా సింగరేణి మెడికల్ సూపరిండెంట్ శేషగిరి రావు మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ పురోభివృద్ధికి సింగరేణియులు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. అలాగే సంస్థ విస్తరణకు ప్రాజెక్ట్ ప్రభావిత నిర్వాసితులు, పరిసర గ్రామాల ప్రజలు తమ వంతు బాధ్యతగా ఇతోధికంగా తమ వంతు సహకారం అందిస్తున్నారన్నారు. వారి సహకారాన్ని దృష్టిలో ఉంచుకొని సింగరేణి ద్వారా క్రమం తప్పకుండ ఉచిత వైద్య సేవలు అందించాలని సింగరేణి సంస్థ చైర్మెన్ & మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం ఆదేశంతో ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ సూచన మేరకు మణుగూరు ఏరియా పరిసర ప్రాంత గ్రామస్తులకు అందిస్తున్న ఉచిత వైద్య శిభిరాలను మరింతగా విస్తృత పరుస్తున్నట్లు తెలిపారు. అనంతరం ప్రబల్లుతున్న సీజనల్ వ్యాధుల బారిన పడకుండా పరిసరాల, గృహ ,వ్యక్తిగత పరిశుభ్రత తప్పక పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి డాక్టర్లు టి సురేష్, వేంకట రమణయ్య,ఏరియా హాస్పిటల్ సిబ్బంది రూప, రవి , పీ నందిని, కె రవి, సీనియర్ పర్సనల్ అధికారి సింగు శ్రీనివాస్, సేవ కో ఆర్డినేటర్ కె వీ మారేశ్వర రావు, మాజీ సేవ కో ఆర్డినేటర్ యండి యూసఫ్, గ్రామస్తులు పాల్గొన్నారు.

