అన్ని బ్యాంకుల అధికారులు రుణమాఫీ డబ్బులను రైతులకు అందించాలి
అన్ని బ్యాంకుల అధికారులు రుణమాఫీ డబ్బులను రైతులకు అందించాలి
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు రుణమాఫీ పథకం జిల్లాలో అమలుపై అన్ని బ్యాంకుల అధికారులతో గురువారం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లోని ఐదు నియోజకవర్గాల్లో లక్ష రూపాయలు లోపు రుణాల మాఫీ క్రింద 28018 మంది లబ్ధిదారులను గుర్తించినట్లు తెలిపారు. గుర్తించిన లబ్ధిదారులందరికీ తమ యొక్క బ్యాంక్ అకౌంట్లో రుణమాఫీ డబ్బులు జమ అ వుతాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అన్ని బ్యాంకుల అధికారులు రుణమాఫీ డబ్బులను రైతులకు అందించాలని మరే ఇతర రుణములకు ఈ డబ్బులను నిలుపదల చేయరాదని బ్యాంక్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రైతులు రుణమాఫీ పథకం డబ్బులను ఉపయోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. రుణమాఫీ పథకం కింద భూమి కలిగి ఉన్న రైతు ప్రతి కుటుంబానికి రెండు లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందని ఆయన తెలిపారు. 12-12-2018 వ తేదీన లేదా ఆ తర్వాత మంజూరు అయినా లేక రెన్యువల్ అయినా రుణాలకు మరియు 09-12-2023 తేదీ నాటికి బకాయి ఉన్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. రైతు రుణమాఫీ పథకంలో భాగంగా లక్ష రూపాయల లోపు రుణాలు అన్నీ మాఫీ అవుతాయని తెలిపారు.
పంట రుణమాఫీ పథకం గురించి సందేహాలు, ఇబ్బందుల పరిష్కారానికి పరిష్కార విభాగము ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు తమ ఇబ్బందులను ఈ పరిష్కార విభాగంలో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. దీనిలో భాగంగా హెల్ప్ డెస్క్ నెంబర్లను ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు. రాజేశ్వర్ జూనియర్ అసిస్టెంట్ 7416442798 , అశోక్ కుమార్ వ్యవసాయ అధికారి 9550226672 సంప్రదించి రైతులు వారి సందేహాలను నివృత్తి చేసుకోవాల్సిందిగా కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ రెడ్డి, అన్ని బ్యాంకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.