వరదల పట్ల అప్రమతంగా ఉండాలి
వరదల పట్ల అప్రమతంగా ఉండాలి :జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల జిల్లా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా జితేష్ వి. పాటిల్ కలెక్టర్ అన్నారు.శుక్రవారం అదనపు కలెక్టర్ లు ,ఆర్డీవోలు, తాసిల్దారులు, ఎంపీడీవోలు, ఇరిగేషన్ అధికారులు మరియు జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు మరియు వరదలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
ఇరిగేషన్ అధికారులు అన్ని ప్రాజెక్టుల వద్ద ఇసుక బస్తాలు అందుబాటులో ఉంచాలని, నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. అన్ని ప్రాజెక్టుల వద్ద గేట్లు తెరుచు సమయం ముందుగా క్రింద ఉన్న గ్రామాలకు తెలియజేయాలని ఆదేశించారు. నీరు క్రిందకి వదిలిన వెంటనే తాసిల్దారులు, ఎంపీడీవోలు అన్ని గ్రామాలకు చాటింపు ద్వారా తెలియజేయాలని..ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని తెలిపారు.
ప్రతి గ్రామాలలో పునరావాస కేంద్రాలను గుర్తించాలని తెలిపారు. అన్ని గ్రామాలలో మరమ్మతులకు గురైన బ్రిడ్జిలు గుర్తించి వాటికి తగిన మరమ్మత్తులను సత్వరమే పూర్తి చేయాలని తెలిపారు. వరద సాయం కు కావలసిన పనిముట్లు లైట్లు, మైకులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామ సెక్రెటరీ కి మైకు మరియు టార్చ్ లైట్ అందజేస్తామని తెలిపారు. తాసిల్దారులు అందరికీ వరద నష్టం పై ఇచ్చే పరిహారంపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. అన్ని మండలాల ఎంపీడీవోలు అప్రమత్తంగా ఉంటూ వరద అనంతరం గ్రామాల్లో కరెంటు మరియు మంచినీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు.
అంటు వ్యాధులు ప్రబలకుండా గ్రామాలలో తక్షణమే పారిశుద్ధ్యం చేపట్టి బ్లీచింగ్ చెయ్యాలని తెలిపారు. వరద బాధితులకు కావలసిన మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వరద బాధితులకు పునరావస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు కల్పించాలని తాసిల్దారులను ఆదేశించారు.వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అవసరమైతే హెలికాప్టర్ మరియు ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలను ఉపయోగించుకోవాలని తెలిపారు.