పెద్దవాగు నిర్వాసితులందరినీ ఆదుకుంటాం.
పెద్దవాగు నిర్వాసితులందరినీ ఆదుకుంటాం.
రెవిన్యూ, గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ నెల 18వ తేదీన వరద ఉప్పొంగి గుమ్మడపల్లి గ్రామం వద్ద పెద్దవాగు ప్రాజెక్టు గండి పడి కట్ట తెగిన ప్రాంతాన్ని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు.
కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణతో కలిసి ధ్వంసమైన ప్రాజెక్ట్ ప్రదేశంలో కలియతిరిగి చూసి ప్రాజెక్ట్ కు ఇంతటి గండి పడటం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక అధికారుల ద్వారా పూర్తి వివరాలు తెలుసుకున్నారు.
కోయరంగాపురం, గుమ్మడవల్లి, కొత్తూరు గ్రామాల్లో 51 మంది వరద ముంపు నిర్వాసితుల ఇళ్లకు మంత్రి పొంగులేటి స్వయంగా వెళ్లి పీఎస్ఆర్ ట్రస్టు ద్వారా ఆర్థిక సాయం అందజేశారు. కొత్తూరు గ్రామంలో విద్యుత్ ప్రమాదంలో మరణించిన శివ కుటుంబాన్ని పరామర్శించి, ఆర్ధిక సాయం అందజేశారు.
ఆయా ప్రాంతాల్లో నిర్వాసితులను ఓదారుస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. కోయరంగాపురం గ్రామంలో విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడారు. ఆ వివరాలు ఇలా..ఎకరానికి రూ.10వేలు..నష్టం జరిగిన ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అదుకుంటుందని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.
400 ఎకరాలు ఇసుక మేటతో పూడుకుపోయినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఎకరాకు రూ. 10 వేల చొప్పున తొలగింపు కోసం ఇస్తామని ప్రకటించారు. పత్తి, వరి పంటలు నష్టపోయిన రైతులకు విత్తనాలు ఉచితంగా ఇస్తామని తెలిపారు.
వరదలో కొట్టుకుపోయిన ఒక్కో గొర్రె యజమానికి రూ.3వేలు, ఆవులు, గేదెలకు సంబంధించి యజమానికి రూ. 20,000వేలను ప్రభుత్వం ఇవ్వనుందని తెలిపారు. వరద వల్ల నీట మునిగి ఇళ్లను కోల్పోయిన వారందరికీ ఇందిరమ్మ గృహాలు మంజూరు చేస్తామని
మంత్రి అభయమిచ్చారు.