తెలంగాణ

మేనిఫెస్టో గోడపత్రిక ఆవిష్కరణ

మేనిఫెస్టో గోడపత్రిక ఆవిష్కరణ

ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

వరంగల్ ,శోధనన్యూస్ :

ప్రగతి భవన్ లో ఆదివారం బిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటించిన మేనిఫెస్టో విపక్షాలకు దిమ్మ తిరిగే విధంగా ఉన్నదని హనుమకొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. మేనిఫెస్టో గోడ పత్రికను ఆవిష్కరించారు. హనుమకొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన సోమవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిన్న  ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ తీసుకోవడం జరిగిందన్నారు. పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చిన,ఉద్యమ సమయంలోనైనా, ఎప్పుడైనా తనకు అన్ని రకాలుగా మనోధైర్యమిస్తూ గెలుపులో భాగస్వాములై పనిచేస్తున్నటువంటి ప్రతి బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు సభాముఖంగా ధన్యవాదాలు తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు ఎంతో విశ్వాసంతోని నిత్యం మమేకమై తనను ఆశీర్వదిస్తున్నారన్నారు. పార్టీ మేనిఫెస్టో విడుదల చేయగానే ప్రజలందరూ తమ యొక్క ఆనందాన్ని వెలిబుచ్చరని తెలిపారు. వారి బతుకుల్లో వెలుగు నింపేందుకే ఈ పథకాలు ఎంతగానో ఉపయోగపడతాయని, వాటిని గడప గడపకు తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్త పైన ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాటి ఉద్యమ నేత సీఎం కేసీఆర్ నాయకత్వంలో గత తొమ్మిదేళ్లుగా అనేక సంక్షేమ పథకాల్లో అభివృద్ధి పదంలో తెలంగాణ రాష్ట్రం సాగుతుందని, అలాగే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని అమలు చేస్తూ అన్ని వర్గాల కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి నాయకుడు కేసీఆర్ అన్నారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అయినా కానీ అంబేద్కర్ విగ్రహం దళితవాడల్లో కూడా పెట్టలేకపోయారని, సమైక్య రాష్ట్రంలో అనేక విధాలుగా ఇబ్బందులు పడ్డామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒకవైపు అభివృద్ధి మరొకవైపు సంక్షేమంతో దేశంలో ఎక్కడా లేని పథకాలను తీసుకొచ్చినటువంటి ఘనత మానవతావాది కేసీఆర్ ది అన్నారు. ఉద్యమంలోనైనా తెలంగాణ రాష్ట్ర సాధనలోనైనా ప్రజలు తన సమస్యలను చెప్పినప్పుడు వాటిని పరిష్కరించే దిశగా కృషి చేసానన్నారు. కరోనా కష్టకాలంలో తాను గాని, పార్టీ శ్రేణులు గాని నియోజకవర్గంలో నిత్యవసర వస్తువులను పంపిణీ చేశామని వారికి అన్ని విధాలుగా ఆదుకున్నారని అన్నారు. అలాగే వరదల సమయంలో ఇప్పుడు గానీ 2016 -2017 సమయంలో గానీ కష్టకాలంలో వారికి అండగా ఉన్నానని, వారిలో ఒక కుటుంబ సభ్యుడిగా వారిని ఆదుకున్నారని వారు ఆశీర్వదిస్తేనే ఈ స్థాయికి వచ్చానని అన్నారు. నిన్న విడుదల చేసినటువంటి మేనిఫెస్టో ముఖ్యమంత్రి భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాగా భావించి మేనిఫెస్టోలోని అంశాలు కూడా అమలు చేయడం కోసం,రూపకల్పన చేసి అందించడం జరిగిందన్నారు. గతంలో మేనిఫెస్టో లో లేని అంశాలు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి వాటిని కూడా అమలు చేసినటువంటి ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. మరొక మారు ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఈ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగిందని, 2018 ఎలక్షన్ సమయంలో కాంగ్రెస్ అమలుకు సాధ్యం కానీ పథకాలను మేనిఫెస్టోలో పెట్టి,రూపకల్పన చేసినా కూడా ప్రజలు నమ్మలేదని, బిఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించి మరొకసారి అవకాశం ఇచ్చారని అన్నారు. ఈసారి కూడా మూడవసారి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పాటుపడుతున్న బీఆర్ఎస్ పార్టీకి అధిక సీట్లు వస్తాయనే ధీమాను వ్యక్తం చేశారు.ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసరా పెన్షన్లను మొదటి సంవత్సరం రూ.3016, ప్రతి సంవత్సరం 500 పెంచుతూ రూ.5016 ఇస్తామని అన్నారు. అలాగే కరోనా కష్టకాలంలో ఎంతోమంది కరోనా బారిన పడి చనిపోవడం వల్ల వాటి యొక్క కుటుంబ స్థితిగతులు చిన్నాభిన్నమయ్యాయని, వాటిని గుర్తించిన సీఎం కేసీఆర్, కెసిఆర్ బీమా- ప్రతి ఇంటికి ధీమా అనే పథకాన్ని తీసుకువచ్చారని అన్నారు. ప్రతి రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి సన్నబియ్యం ఇవ్వడమే కాకుండా వికలాంగులకు రూ. 4016 లు ఇంతకుముందు ఇచ్చామని, వాటిని 6000 కు పెంచడం జరిగిందని అన్నారు. ఇంతకుముందు రైతుబంధు పదివేల రూపాయలు ఉంటే ఇప్పుడు రూ.16000 చేశారని, అర్హులైన నిరుపేద పేదలందరికీ నెలకు రూపాయలు మూడు వేలు అందిస్తామని అన్నారు. లబ్ధిదారులకు, జర్నలిస్టు మిత్రులకు రూపాయలు 400 రూపాయలకే గ్యాస్ అందిస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాల వల్ల మహిళలు మళ్లీ కట్టెల పొయ్యి వాడే పరిస్థితి వచ్చింది కాబట్టే రూపాయలు 400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని అన్నారు.   ప్రతి డివిజన్ లో ప్రజా ఆశీర్వాదయాత్ర అనే పేరుతో ప్రచారం నిర్వహిస్తామని,ఈరోజు 59, 60 డివిజన్లో ప్రచారం నిర్వహిస్తానని చెప్పారు.ఎన్నికల సమయంలో మాత్రమే ప్రతిపక్ష పార్టీలైనటువంటి కాంగ్రెస్,బిజెపి పార్టీలు ప్రభుత్వంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ పైన అనేక విమర్శలు చేస్తున్నారని, ప్రజలు వాటిని గమనిస్తున్నారని అన్నారు. ప్రజలకు కష్టమొచ్చిన నాయకుడిని కాపాడుకుంటారే తప్ప,ఎన్నికల్లో మాత్రమే కనబడే వ్యక్తిని గుర్తించారని ఈ సందర్భంగా తెలిపారు. ఒక నాయకుడు గడియారాలు పంచవచ్చు, మరొక నాయకుడు కుక్కర్లు పంచి ప్రజలకు మభ్య పెట్టవచ్చు కానీ ప్రజలు తమకు పని చేసే నాయకుడిని ఎన్నుకుంటారన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైనటువంటి వారందరికీ కూడా బీమాను పెంచడం జరిగిందన్నారు. అసైన్డ్ భూములు కలవారికి పట్టాలు ఇస్తానని చెప్పారని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ప్రతిపక్ష పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్కో చైర్మన్ వై. సతీష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, నాయకులు శివ శంకర్, ఈగ మల్లేశం, కేశవరెడ్డి, సంపత్ రెడ్డి,మాజీ డిప్యూటీ మేయర్ సిరాజుద్దీన్,సోనీ, రవీందర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *