Wayanad : వయనాడ్ లో మృతుల సంఖ్య 385
వయనాడ్ లో మృతుల సంఖ్య 385
వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో ఏడో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముండక్కై, చౌరల్మలలో గల్లంతైన వారిని వెలికితీసేందుకు వాలంటీర్లతో సహా 1,500 మందికి పైగా సిబ్బందిని నియమించారు. సోమవారం నాటికి మృతుల సంఖ్య 385కు చేరగా, 180 మందికి పైగా గల్లంతయ్యారు.
ప్రభావిత ప్రాంతాలను ఆరు జోన్లుగా విభజించి ఆ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. కొన్ని ఇళ్లలో దొంగతనాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో రెస్క్యూ సిబ్బందిని మాత్రమే బ్రిడ్జిపైకి అనుమతిస్తున్నారు. మృతదేహాల కోసం చాలియార్ నది వెంబడి గాలింపు చర్యలు చేపడుతున్నారు.
శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను గుర్తించేందుకు డ్రోన్లు, శునకాలను వినియోగిస్తున్నారు. పుత్తుమలలో గుర్తుతెలియని మృతదేహాలకు సామూహిక దహన సంస్కారాలు నిర్వహించనున్నారు. ఆదివారం 25 గుర్తుతెలియని మృతదేహాలు, శరీర భాగాలను పూడ్చిపెట్టారు.
గల్లంతైన వారి జాబితాను తయారు చేస్తామని, ఇందుకోసం ఆశా, అంగన్వాడీ కార్యకర్తలను వినియోగించుకుంటామని రెవెన్యూ మంత్రి కె.రాజన్ తెలిపారు. బాధితులకు తిరిగి సర్టిఫికెట్లు ఇచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. కాగా, వయనాడ్లో సహాయక శిబిరాలు నిర్వహిస్తున్న విద్యాసంస్థలు మినహా మిగతా చోట్ల పాఠశాలలు తెరుచుకున్నాయి.
వయనాడ్ లోని 16 సహాయ శిబిరాల్లో 2,500 మందికి పైగా ఆశ్రయం పొందుతున్నారు. 723 కుటుంబాలకు చెందిన 2,514 మంది శిబిరాల్లో నివసిస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో పురుషుల సంఖ్య 943, మహిళల సంఖ్య 972, గ్రామంలో నివాస గృహాలు 599 ఉన్నాయి. శిబిరాల్లో ఆరుగురు గర్భిణులు ఉంటున్నారు.