పనుల పురోగతి పై నివేదికలు అందించాలి.
పనుల పురోగతి పై నివేదికలు అందించాలి.
–ఎన్నికల నియమావళి లో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి
-ఇంకుడు గుంతలను పూర్తి చేయాలి
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్:
పనుల పురోగతిపై నివేదికలు అందచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో ప్రజావాణి, ఇంజనీరింగ్ పనులు పురోగతి, ఐడిఓసి కార్యాలయంలో బయోమెట్రిక్ హాజరు, అంగన్వాడీ కేంద్రాల్లో రెయిన్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ తదితర అంశాలపై అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి, తగు చర్యల నిమిత్తం ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని ఇంజనీరింగ్ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు వారి వారి శాఖాపరంగా చేపట్టిన ప్రనుల పురోగతిపై నివేదికలు అందచేయాలని చెప్పారు. గ్రౌండింగ్ చేసి జరుగుతున్న పనులపై మాత్రమే నివేదికలు అందచేయాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున నూతనంగా ఎలాంటి పనులు చేపట్టడానికి అనుమతి లేదన్నారు. బయోమెట్రిక్ హాజరు తప్పని సరిగా వేయాలన్నారు. కొన్ని శాఖల్లో బయోమెట్రిక్ హాజరుశాతం తక్కువగా నమోదు కావడం పట్ల ఆయా శాఖల అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలని కలెక్టరేట్ ఏఓకు సూచించారు. ప్రభుత్వ సిబ్బంది తప్పని సరిగా సమయపాలన పాటించాలన్నారు. ప్రతి వారం బయోమెట్రిక్ హాజరుపై సమీక్షా సమావేశం నిర్వహిస్తామని ఆయా శాఖల అధికారులు తప్పనిసరిగా సిబ్బంది ద్వారా బయో మెట్రిక్ హాజరు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షపునీటి సంరక్షణకు జిల్లాలో 324 అంగన్వాడీ కేంద్రాల్లో చేపట్టిన ఇంకుడుగుంతల ప్రగతిని సమీక్షించారు. ప్రతి వర్షపు నీటి చుక్కను సద్వినియోగం చేసుకునేందుకు, భూ గర్భ జలాలను పెంచేందుకు చేపట్టిన జల సంరక్షణ చర్యల్లో భాగంగా ఇంకుడు నిర్మాణాలను పూర్తి చేయాలని చెప్పారు. భూమిలోకి ఇంకింప చేసేందుకు తద్వారా భూ గర్భ జలాలు పెంపొందించడానికి ఈ చర్యలు సత్ఫలితాలను ఇస్తాయన్నారు. పనుల పురోగతిని ఎంపిడిఓలను అడిగి తెలుసుకున్న కలెక్టర్ శుక్రవారం తనకు నివేదికలు అందచేయాలని సంబంధిత శాఖ అధికారికి సూచించారు. పూర్తి చేసిన పనులకు యంబిలో నమోదులు చేయాలన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు రాంబాబు, మధుసూదన్ రాజు, డిఆర్డీఓ రవీంద్రనాథ్, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.