వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం.
వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం.
త్వరలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం అన్ని విధాల ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ ఆదేశించారు. ఐడిఓసి కార్యాలయంలో ఎంపీడీవోలు,తహసిల్దారులతో పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బందికి విధుల కేటాయింపు వంటి పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఎన్నికలకు కేటాయించిన సిబ్బందికి తగిన విధంగా శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు. భారీ వర్షాలు, వరదలకు జిల్లాలో దెబ్బతిన్న రోడ్ల విషయంలో స్థానికంగా పడిన గుంతలను పూడ్చాలని, అదేవిధంగా దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని దీని విషయంలో పంచాయతీరాజ్ అధికారులు అంచనాలను రూపొందించాలన్నారు.భారీగా వరదలు వచ్చిన నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పంచాయతీ అధికారులు,సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి శానిటేషన్ పనులను ముమ్మరం చేయాలని చెప్పారు.
ఎప్పటికప్పుడు చెత్తాచెదారం లేకుండా తొలగించాలని దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతూనే గ్రామాల్లో ప్రతిరోజు ఫాగింగ్ చేయాలన్నారు. అదేవిధంగా ముంపు ప్రాంతాలలో ప్రత్యేక పారిశుద్ధ పనులను చేపట్టి బ్లీచింగ్ పౌడర్ ను చల్లించాలన్నారు. గ్రామాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలతో పాటు ప్రధాన రహదారులకు పక్కన ఇంకుడు గుంతలను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. మరో నాలుగైదు రోజులు వర్ష సూచన ఉన్నందున ముంపు ప్రాంతాలపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని చెప్పారు. అటు గోదావరి ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో సంబంధిత ముంపు ప్రాంత మండలాల అధికారులు గర్భిణీ స్త్రీలు, వృద్ధులను తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.