ప్రపంచ స్థాయి మానవ వనరుల తయారీ లక్ష్యంగా చర్యలు
ప్రపంచ స్థాయి మానవ వనరుల తయారీ లక్ష్యంగా చర్యలు: భట్టి విక్రమార్క
ఖమ్మం: మన విద్యార్థులను ప్రపంచ స్థాయి మానవ వనరులుగా తయారు చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు అన్నారు.
శుక్రవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘు రాం రెడ్డి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ లతో కలిసి మధిర నియోజకవర్గం బోనకల్ మండలం లక్ష్మీపురంలో సుమారు 25 ఎకరాల స్థలంలో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. లక్ష్మీపురం గ్రామం నుంచి తెలుగు ప్రజలందరికీ విజయదశమి/దసరాపండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. విజయదశమి నుంచి ప్రారంభించే మంచి కార్యక్రమాలు విజయవంతం అవుతాయని, నేడు ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజల జీవితాలను సమూలంగా మార్చగలిగే విద్యా వ్యవస్థకు అధికంగా నిధులు కేటాయించాలని, ప్రపంచంతో పోటీ పడే విధంగా మన విద్యార్థులను తయారు చేసుకునేందుకు అవసరమైన సిలబస్, మౌళిక వసతులు ఏర్పాటు చేసుకోవాలని , భవిష్యత్తులో ప్రపంచానికి మానవ వనరులను అందించాలనే ఉద్దేశంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లను ప్రారంభించామని అన్నారు.
సమాజాన్ని ఎస్సి, ఎస్టీ, బీసీ మైనారిటీ వంటి కులాలకు మతాల పేరుతో విడదీయకుండా ఉమ్మడి కుటుంబంలా అందర్ని కలుపుకొని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సమీకృత విద్యా సంస్థలను ఏర్పాటు చేసి అన్ని వర్గాల ప్రజలకు విద్యను అందించే కార్యక్రమానికి నాంది పలికామని అన్నారు.
ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి మాట్లాడుతూ.. రెండు నెలల క్రితం ఉప ముఖ్యమంత్రి రివ్యూ సమావేశం నిర్వహించి ఆంగ్ల భాష పరిజ్ఞానాన్ని విద్యార్థులలో ఎలా పెంచాలని చర్చించారని, ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల రూపకల్పనలో డిప్యూటీ ముఖ్యమంత్రి పాత్ర కీలకమైందని అన్నారు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల వంటి సౌకర్యం ప్రపంచంలో ఎక్కడా లేదని, ఇది చాలా ప్రత్యేకమైందని, ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనారిటీ వర్గాల పిల్లలు ఒకే చోట చదువుకునేందుకు అవసరమైన వస్తువులతో ప్రభుత్వం దీన్ని నిర్మిస్తుందని అన్నారు.
విద్యార్థులు చాలా మంది హైదరాబాద్ కు చదువు కునేందుకు వస్తారని, ఇటువంటి పాఠశాలలు నిర్మించడం ద్వారా ఆ అవసరం రాదని అన్నారు. మనం నిర్మించే పాఠశాలలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శవంతం కావాలని ఎంపీ ఆకాంక్షించారు.