ఐక్యతకు పునాదులు వేసిన వల్లభాయ్ పటేల్: కలెక్టర్ జితేష్
ఐక్యతకు పునాదులు వేసిన వల్లభాయ్ పటేల్ : జిల్లా కలెక్టర్ జితేష్
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్బంగా ఐ డి ఓ సి కార్యాలయంలో రాష్ట్రీయ ఏక్తా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ జితేష్, అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ తో కలసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం జాతి ఐక్యతపై అధికారులు మరియు సిబ్బందితో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలంతా బేధాభిప్రాయాలను విడిచిపెట్టి జాతీయ ఐక్యత భావంతో మెలగాలని చెప్పారు. దాస్య శృంఖలాలలో చిక్కుకుని సంక్షోభంలో ఉన్న భారత దేశానికి స్వాతంత్రం కావాలని భగత్ సింగ్ నుంచి మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి గొప్ప నాయకులు ఎన్నో ఉద్యమాలు చేశారని తెలిపారు. రవి అస్తమించని సామ్రాజ్యాన్ని పారదోలిన గొప్ప మహనీయులు భారత్ లో ఉన్నారని చెప్పారు. స్వాతంత్రం ఇచ్చినట్లు బ్రిటిష్ వారు ప్రకటించినప్పటికీ 500 సంస్థానాలకు అధికారాలు ఇవ్వడంతో ఎన్నో సమస్యలు ఉత్పన్నమయ్యాయన్నారు.
వందలాదిమంది మృత్యువాత పడడంతో ఎంతో చాకచక్యంగా భారత తొలి ఉప ప్రధాని, కేంద్ర హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ వ్యవహరించారన్నారు. సంస్థానాలపై సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని ఉక్కుమనిషిగా సైనిక చర్యలతో జాతి ఐక్యతకు బాటలు వేశారని తెలిపారు. ఆయన చూపిన ఐక్యత మార్గంలో భారత్ నడుస్తూ ప్రపంచ దేశాల సరసన ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఏర్పడిందని అభివర్ణించారు. జాతి నాయకుల పోరాటాలు, ఉద్యమాల కృషితో దేశం పురోభివృద్ధిలో పయనిస్తుందన్నారు. జాతి మొత్తం ఐక్యతతో మెలగాలని ఆయన సూచించారు.