ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్ సర్వే పూర్తి చేయాలి
నెలాఖరు లోగా ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్ సర్వే పూర్తి చేయాలి: కలెక్టర్ జితేష్
ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ యాప్ సర్వే ను నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ అధికారులను ఆదేశించారు. ఐడిఓసి కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే, గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ మరియు నూతన డైట్ మెనూ పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమాల పై అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన లతో కలిసి జిల్లాలోని ఆర్డీవోలు, తాసిల్దార్లు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ సెక్రటరీలు మరియు సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల సర్వే త్వరితగతిన పూర్తయ్యేలా తగిన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీ సెక్రటరీలు అందరూ క్షేత్రస్థాయిలో పర్యటించి దరఖాస్తు నమోదు చేపట్టాలని, నమోదు ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. దరఖాస్తుదారులు ఒకచోట నివసిస్తూ ఉండి వారికి వేరొక ప్రదేశంలో స్థలం ఉన్నచో అటువంటి దరఖాస్తులను తీసుకొని వివరణలో తగిన వివరాలు నమోదు చేయాలన్నారు.
ప్రతి దరఖాస్తులు యాప్ లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా మండల మరియు గ్రామస్థాయిలో ఎన్ని దరఖాస్తులు ఉన్నవి నివేదికలు తయారు చేసుకొని ఎక్కువ దరఖాస్తులు ఉన్నచోట సర్వేకు అదనపు సిబ్బందిని కేటాయించాలని అధికారులను ఆదేశించారు. భద్రాచలం మరియు కొత్తగూడెం ఆర్డీవోలు ఇందిరమ్మ ఇండ్ల మోడల్ హౌస్ నిర్మాణం కోసం స్థలం గుర్తించి త్వరితగతిన మోడల్ హౌస్ నిర్మించాలని అధికారులను ఆదేశించారు.