తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

క్రీడాకారుల విజయాలు జిల్లాకు గర్వకారణం 

క్రీడాకారుల విజయాలు జిల్లాకు గర్వకారణం 
– జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ 
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ :
క్రీడాకారులు సాధించిన పథకాలు విజయాలు జిల్లాకు గర్వకారణంగా నిలుస్తాయని జిల్లా కలెక్టర్ జితేష్ అన్నారు. పాల్వంచ మినీ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన అభినందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని ఇటీవల కాకతీయ యూనివర్సిటీ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ప్రతిభ కనబరిచి అవార్డులు సాధించిన జిల్లా క్రీడాకారులను ఘనంగా అభినందించారు. పాల్వంచ మినీ స్టేడియంలో నిరంతరం సాధన చేస్తూ చాంపియన్‌షిప్ స్థాయి విజయాలు సాధించడం అభినందనీయమన్నారు. ఈచాంపియన్‌షిప్‌లో ట్రైబల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కాలేజ్ విద్యార్థినులు అధిక సంఖ్యలో పాల్గొని విజయాలు సాధించడం ప్రత్యేకంగా హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా కాలేజ్ ప్రిన్సిపాల్ అనురాధ, ఫిజికల్ డైరెక్టర్ శ్వేతతో పాటు విజయం సాధించిన విద్యార్థినులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అలాగే అథ్లెటిక్స్‌లో క్రీడాకారులను శిక్షణనిచ్చి తీర్చిదిద్దుతున్న అథ్లెటిక్స్ కోచ్ నాగేంద్ర, సెక్రటరీ మహిధర్‌లకు కూడా జిల్లా కలెక్టర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. గిరిజన విద్యార్థినుల్లోని క్రీడా ప్రతిభను వెలికి తీస్తూ వారికి సరైన మార్గనిర్దేశం అందిస్తున్న అధ్యాపకులు, అధికారుల కృషి ప్రశంసనీయమన్నారు. వారి నిరంతర కృషి ఫలితంగానే జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర, విశ్వవిద్యాలయ స్థాయిలో క్రీడాకారులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని తెలిపారు.

పాల్వంచ మినీ స్టేడియంలో ఇటీవల నిర్వహించిన ఎస్‌జీఎఫ్ (SGF) టెన్నిస్ రాష్ట్రస్థాయి మీట్‌లో పాల్గొన్న క్రీడాకారులను కూడా జిల్లా కలెక్టర్ అభినందించారు. రాష్ట్రస్థాయిలో జిల్లా క్రీడాకారులు పాల్గొని ప్రతిభ చూపించడం భవిష్యత్తులో మరింత ఉన్నత విజయాలకు దారితీస్తుందని అన్నారు. టెన్నిస్ సీనియర్ ప్లేయర్ అన్నం వెంకటేశ్వర్లు జాతీయ స్థాయి టోర్నమెంట్‌లో విజయం సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావడం గర్వకారణమని పేర్కొంటూ కలెక్టర్ ఆయనను ప్రత్యేకంగా సత్కరించారు. ఈ విజయం యువ క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు.
జిల్లాలోని క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, శిక్షణ వసతులు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని, క్రీడల్లో ప్రతిభ కనబరిచే ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా శాఖ అధికారి పరంధామరెడ్డి, విద్యార్థులు, క్రీడాకారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *