కిన్నెరసాని ప్రకృతి సౌందర్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలి
కిన్నెరసాని ప్రకృతి సౌందర్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలి
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
ఆళ్లపల్లి , డిసెంబర్ 23-శోధన న్యూస్ : కిన్నెరసాని ప్రకృతి సౌందర్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పిలుపునిచ్చారు. ఏరు రివర్ ఫెస్టివల్‌లో భాగంగా మంగళవారం ఆళ్లపల్లి మండలం రాయపాడు గ్రామం నుండి మొతలగూడెం వరకు కిన్నెరసాని రివర్ వాక్ కార్యక్రమాన్ని విజజయవంతంగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ రివర్ వాక్‌లో యువత పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొని, కిన్నెరసాని నది పరిరక్షణ, పర్యావరణ సంరక్షణ, నదుల ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ స్వయంగా, ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ, యువతతో కలిసి రివర్ వాక్‌లో పాల్గొని వారితో మమేకమయ్యారు. నది తీర ప్రాంతాల వెంట సాగిన ఈ వాక్ సందర్భంగా జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి ఉన్న విస్తృత అవకాశాలు, కిన్నెరసాని నది పరిసర ప్రాంతాల సహజ సంపద, అలాగే జిల్లాలోని వివిధ పర్యాటక ప్రాంతాల విశిష్టతను యువతకు కలెక్టర్ వివరించారు. జిల్లాలో ఉన్న అటవీ ప్రాంతాలు, నదులు, జలపాతాలు, ప్రకృతి వనరులు పర్యాటకులను ఆకర్షించే సామర్థ్యం కలిగి ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ విధంగా జిల్లాలోని వివిధ పర్యాటక ప్రాంతాల ప్రత్యేకతలను యువతకు వివరిస్తూ రివర్ వాక్ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కిన్నెరసాని నది జిల్లా జీవనాధారంగా ఉండటంతో పాటు పర్యావరణ సమతుల్యతకు కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. నది చుట్టూ ఉన్న పచ్చని అడవులు, సహజ వనరులు, జీవ వైవిధ్యం భవిష్యత్ తరాలకు కాపాడాల్సిన అమూల్యమైన సంపద అని తెలిపారు. ఈ ప్రకృతి సౌందర్యాన్ని సంరక్షించుకుంటూనే దేశ విదేశాలకు పరిచయం చేస్తే జిల్లాలో పర్యాటక రంగం మరింతగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఏరు రివర్ ఫెస్టివల్ ప్రధాన లక్ష్యం జిల్లాలోని నదుల, పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడమేనని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందితే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, రవాణా, స్థానిక ఉత్పత్తుల విక్రయాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని అన్నారు. యువత సోషల్ మీడియా, డిజిటల్ వేదికల ద్వారా కిన్నెరసాని నది ప్రకృతి అందాలు, జిల్లాలోని పర్యాటక ప్రాంతాల విశిష్టతను ప్రపంచానికి తెలియజేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఫోటోగ్రఫీ, వీడియోలు, డాక్యుమెంటరీలు, రీల్స్, బ్లాగుల ద్వారా ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేలా కృషి చేయాలని సూచించారు.అలాగే నదులను కాలుష్యరహితంగా ఉంచడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధి దిశగా, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడేలా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి యం. పరంధామ రెడ్డి, స్థానిక అల్లపల్లి మండల ఎంపీడీవో శ్రీను, తహసిల్దార్ జగదీశ్వర ప్రసాద్, ఎంఈఓ సంతా రావు, కృష్ణయ్య, గ్రామ సర్పంచ్ చిన్న పాపయ్య, పంచాయతే సెక్రెటరీ వరుణ్, టి ఎన్జీవోస్ ఉద్యోగ సంఘాల నాయకులు భార్గవ్ చైతన్య, అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రెటరీ మహిధర్, నాగేంద్ర, ఆర్చెరీ కోచ్ కల్యాణ్, సైకిలింగ్ నాగేశ్వర రావు, ఉదయ్ కుమార్, టైక్వాండో రమేశ్, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, స్థానిక యువత, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.


