Uncategorizedతెలంగాణపినపాకభద్రాద్రి కొత్తగూడెం

జాతీయ స్థాయి కబడ్డీ పోటీలతో  జిల్లా క్రీడారంగానికి  ప్రత్యేక గుర్తింపు

జాతీయ స్థాయి కబడ్డీ పోటీలతో  జిల్లా క్రీడారంగానికి  ప్రత్యేక గుర్తింపు

-పూర్తైన 33 జట్ల రిజిస్ట్రేషన్  

-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం/పినపాక,  జనవరి 4-శోధన న్యూస్ : 

జాతీయ స్థాయి కబడ్డీ పోటీల నిర్వహణతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రీడా రంగానికి  ప్రత్యేక గుర్తింపు పొందనుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు.  జిల్లాలోని పినపాక నియోజకవర్గం  పినపాక మండలం ఏడుళ్ళ బయ్యారం గ్రామంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో  స్కూల్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 69వ జాతీయ కబడ్డీ పోటీలు ఈ నెల  7వ తేదీ నుండి ఘనంగా ప్రారంభం కానున్నాయని జిల్లా కలెక్టర్  తెలిపారు. జాతీయ స్థాయిలో నిర్వహించబడు తున్న ఈ ప్రతిష్టాత్మక క్రీడా పోటీలకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మరియు జాతీయ స్థాయి విద్యా సంస్థల నుంచి భారీ స్పందన లభించిందని ఆయన తెలిపారు. ఈ పోటీలు అండర్–17 బాలుర విభాగంలో నిర్వహించబడనున్నాయని, మొత్తం 33 జట్లు ఈ పోటీల్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.

    తెలంగాణ, ఆంధ్రప్రదేశ్,  తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, బిహార్, అస్సాం, ఒడిశా, పశ్చిమ బెంగాల్, మణిపూర్, త్రిపుర, గుజరాత్, ఢిల్లీ, చండీగఢ్, పుదుచ్చేరి, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో పాటు దాద్రా,  నగర్ హవేలీ , డామన్ అండ్  డియూ కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి జట్లు ఈ పోటీల్లో పాల్గొననున్నాయని తెలిపారు. అలాగే  కేంద్రీయ విద్యాలయ సంఘటన్ , నవోదయ విద్యాలయ సమితి  , సీబీఎస్‌ఈ వెల్ఫేర్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్, సీఐఎస్‌సీఈ  , విద్యాభారతి వంటి జాతీయ స్థాయి విద్యా సంస్థల జట్లు కూడా పాల్గొని తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించనున్నట్లు తెలిపారు.

   ప్రతి జట్టు నుంచి 6 నుంచి 12 మంది క్రీడాకారులతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యిందన్నారు.  క్రీడాకారులు, కోచ్‌లు, అధికారులు, అతిథులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతి, భోజనం, త్రాగునీరు, వైద్య సదుపాయాలు, భద్రత, రవాణా ఏర్పాట్లు తదితర అంశాలపై పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ జాతీయ క్రీడా ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించి జిల్లా ఖ్యాతిని జాతీయ స్థాయిలో మరింత పెంచేలా సంబంధిత శాఖలు, నిర్వాహకులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *