Collector : హరితవనాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్
హరితవనాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన తో కలిసి లక్ష్మీదేవి పల్లి మండలం ప్రశాంతి నగర్ గ్రామపంచాయతీ మోడల్ అంగన్వాడి మరుగుదొడ్లు మరియు రేగళ్ల, బావోజీ నగర్ తండాల్లో ఏర్పాటుచేసిన హరితవనాలను పరిశీలించారు. ముందుగా లక్ష్మీదేవి పల్లి మండలం ప్రశాంతి నగర్ గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పథకం కింద అంగన్వాడీ పాఠశాలలో చిన్నపిల్లలు మరియు గర్భిణీ స్త్రీలకు ఉపయోగపడే విధంగా నిర్మించిన మోడల్ మరుగుదొడ్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం వనమోహత్సవంలో భాగంగా రేగళ్ల మరియు బావోజి తండాల్లో హరితవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనమహోత్సవం కార్యక్రమం అని రాష్ట్రంలో అడవులను పెంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రేగళ్ల గ్రామంలో ఖాళీగా ఉన్న 12 ఎకరాల అటవీ ప్రాంతంలో 6000 మొక్కలను ఉపాధి హామీ పథకం ద్వారా నాటామని తెలిపారు. నాటిన మొక్కల్లో ఉసిరి, చింత, నేరేడు, వేప,రాగి,వెలగా, సీతాఫలం మరియు మామిడి తదితర మొక్కలు ఉన్నాయని తెలిపారు.మొక్కకు మొక్కకు మధ్యసరైన దూరము మరియు ఒక పెద్ద మొక్క తదుపరి ఒక చిన్న మొక్క ఉండే విధంగా ప్లాంటేషన్ చేయాలని అధికారులకు సూచించారు. వచ్చే బుధవారం ఉదయం 6:30 గంటలకు గ్రామంలోని యువకులతో పాటు నేను కూడా వస్తాను అందరం కలిసి నాటిన మొక్కలకు పాదులు చేద్దాం అని తగిన ఏర్పాట్లు చేయవలసిందిగా స్థానిక అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీల్లో ప్రయోగాత్మకంగా ఉపాధి హామీ పథకం ద్వారా ఒక నీటి కుంట ఏర్పాటు చేసి అజోల్లా పంపకం చేపట్టాలని సూచించారు.