Farmer :ప్రతి రైతుకు ప్రభుత్వ సహాయం అందాలి
ప్రతి రైతుకు ప్రభుత్వ సహాయం అందాలి.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ జితేష్ , జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ , ఐటిడిఏ పిఓ రాహుల్ తో కలిసి అశ్వరావుపేట మండలం పెదవాగు ప్రాజెక్టు గండి ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం గుమ్మడవెల్లి గ్రామంలో వరదల వల్ల దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి, అక్కడ ప్రజలతో మాట్లాడి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. మండలంలో వరద తాకిడి వల్ల నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాయక చర్యలుచేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
దమ్మపేట మండలం కొత్తూరు గ్రామం లో గల గిరిజన మహిళా డిగ్రీ కళాశాల లో ఇరిగేషన్, రెవెన్యూ,పంచాయతీ, విద్యుత్, వైద్యం, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, ఐటీడీఏ మరియు పోలీస్ అధికారుల తో వరద వల్ల జరిగిన పంట నష్టం తర్వాత తీసుకో వలసినచర్యల పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ముందు గా నీటి పారుదల శాఖ అధికారులను గండి పడటానికి గల కారణాలను వారు తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఇరిగేషన్ ఈ ఈ ని ప్రాజెక్టుని ఎప్పుడూ తనిఖీ చేశారు అని ప్రశ్నించగా జూన్ నెలలో చేశామని సమాధానం ఇచ్చారు. జులైలో ఎందుకు నిర్వహించలేదని ఆగ్రహించారు. వరదను ముందుగా అంచనా వేసి గేట్లను తెరిచి ఉంటే నష్టం వాటిల్లేదు కాదని తెలిపారు.ప్రాజెక్టు గండి పడటానికి గల కారణాలనుసమగ్ర విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలనికలెక్టర్ ను కోరారు.
రెవెన్యూ అధికారులను వరదలు అనంతరం తీసుకున్న చర్యలు పై వివరణ అడగగా ఆర్డిఓ కొత్తగూడెం మాట్లాడుతూ వరద గురి అయిన గుమ్మడవల్లి, కొత్తూరు, ఆనంతారం గ్రామాలలోని 70 కుటుంబాలకు చెందిన 250 మందికి పునరావాసం కల్పించామని తెలిపారు. కుటుంబానికి పది కేజీల బియ్యం, కందిపప్పు మంచి నూనె ప్యాకెట్, కూరగాయలు ఈరోజు సాయంత్రం లోపల అందజేయాలని మంత్రి ఆదేశించారు.