ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలి.
ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలి.
ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. ఐడిఓసీ కార్యాలయంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల నిర్వహణ, నిమజ్జన ఏర్పాట్లపై రెవెన్యూ, పోలీస్, పంచాయతి రాజ్, అగ్నిమాపక, విద్యుత్, మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించడానికి పకడ్బందీ చర్యలు తీసుకావాలని అన్నారు. అన్ని గణేష్ మండపాలను తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు, వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ముందస్తుగా గణేష్ మండలి నిర్వాహకులు పూర్తి వివరాలు అందించాలని, ఇది ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, మండల స్థాయిలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు సమావేశాలు నిర్వహించాలన్నారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాలు మొదటి రోజు నుండి నిమజ్జనం వరకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రశాంత వాతావరణంలో అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా నిర్వహించాలని చెప్పారు. మండపాలకు విద్యుత్ ఏర్పాటుకు తప్పని సరిగా విద్యుత్ శాఖ నుండి అనుమతి తీసుకోవాలని చెప్పారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలుపై విద్యుత్ అధికారులు మండపాల్లో ఆడిట్ నిర్వహించాలని చెప్పారు. విద్యుత్ తీగలకు తగల కుండా ఎత్తు తక్కువ ఉండే విగ్రహాలు ఏర్పాటు చేయాలన్నారు.